Mukesh Ambani 20 years Reliance : ముకేశ్ అంబానీ రిలయన్స్ పగ్గాలు చేపట్టి 20 ఏళ్లు..రికార్డుల రిలయన్స్ అధినేత ప్రస్థానంలో కీలక ఘట్టాలు

ఇండియన్ బిజినెస్ టైకూన్, భారత వ్యాపార సామ్రాజ్యపు బాహుబలి. తన ఆలోచనలతో.. ఆవిష్కరణలతో.. ఇండియా ముఖచిత్రాన్ని, ప్రజల జీవన స్థితిగతులనే మార్చేసిన వ్యక్తి.. ఒకే ఒక్కడు.. ముకేశ్ అంబానీ. ఈ భారత అపర కుబేరుడు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్‌గా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. గడిచిన 2 దశాబ్దాల్లో.. తన బిజినెస్ ఎంపైర్‌ని అత్యున్నత శిఖరాలకు చేర్చడమే కాదు.. ప్రపంచం అంచులదాకా విస్తరించారు. 20 ఏళ్ల వ్యాపార ప్రస్థానంలో.. ముకేశ్ అంబానీ సృష్టించిన రికార్డులేంటి?

Mukesh Ambani 20 years Reliance : ముకేశ్ అంబానీ రిలయన్స్ పగ్గాలు చేపట్టి 20 ఏళ్లు..రికార్డుల రిలయన్స్ అధినేత ప్రస్థానంలో కీలక ఘట్టాలు

Mukesh Ambani 20 years Reliance

Updated On : December 30, 2022 / 10:41 AM IST

Mukesh Ambani 20 years Reliance : ఇండియన్ బిజినెస్ టైకూన్, భారత వ్యాపార సామ్రాజ్యపు బాహుబలి. తన ఆలోచనలతో.. ఆవిష్కరణలతో.. ఇండియా ముఖచిత్రాన్ని, ప్రజల జీవన స్థితిగతులనే మార్చేసిన వ్యక్తి.. ఒకే ఒక్కడు.. ముకేశ్ అంబానీ. ఈ భారత అపర కుబేరుడు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్‌గా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. గడిచిన 2 దశాబ్దాల్లో.. తన బిజినెస్ ఎంపైర్‌ని అత్యున్నత శిఖరాలకు చేర్చడమే కాదు.. ప్రపంచం అంచులదాకా విస్తరించారు. 20 ఏళ్ల వ్యాపార ప్రస్థానంలో.. ముకేశ్ అంబానీ సృష్టించిన రికార్డులేంటి?

ముకేశ్ అంబానీ అంటే.. పేరు మాత్రమే కాదు. ఆ పేరుకో పాపులారిటీ ఉంది. దానిని మించి బ్రాండ్ ఉంది. దాని పేరే.. రిలయన్స్. ఆ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేతగా.. ముకేశ్ బాధ్యతలు స్వీకరించి 20 ఏళ్లు పూర్తయింది. 2002లో తండ్రి ధీరూభాయ్ అంబానీ ఆకస్మిక మరణంతో.. తమ్ముడు అనిల్ అంబానీతో కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్వహణ బాధ్యతల్ని తీసుకోవాల్సి వచ్చింది. పెద్దవాడైన ముకేశ్‌‌కు.. రిలయన్స్ ఛైర్మన్, ఎండీ హోదా దక్కింది. అనిల్.. వైస్ ఛైర్మన్, జాయింట్ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కంపెనీ రెండుగా చీలింది. గ్యాస్‌, ఆయిల్, పెట్రో కెమికల్స్‌ విభాగాలను ముకేశ్ అంబానీ తీసుకోగా.. టెలి కమ్యూనికేషన్స్‌, విద్యుత్ ఉత్పత్తి, ఆర్థిక సేవలు.. అనిల్ చేతుల్లోకి వెళ్లాయ్. కొన్నేళ్ల తర్వాత ముకేశ్ తిరిగి టెలికాం రంగంలోకి ప్రవేశించారు. సంస్థను.. రిటైల్‌తో పాటు న్యూ ఎనర్జీ రంగాల్లోకీ విస్తరించారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా ముకేశ్ అంబానీ పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించి.. 20 ఏళ్లలోనే ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీగా మార్చారు. ఆయన సారథ్యంలో.. కంపెనీ ఆదాయం 17 రెట్లు పెరిగింది. లాభం 20 రెట్లు పెరిగింది. అంతేకాదు.. గడిచిన 20 ఏళ్లలో కంపెనీ మార్కెట్ విలువ ఏటా 21 శాతం వృద్ధి చెందుతూ వచ్చింది. 2002 మార్చిలో 41 వేల 989 కోట్లుగా ఉన్న రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్.. 2022 మార్చి నాటికి 17 లక్షల 81 వేల 841 కోట్లకు చేరిందంటే.. ఆ క్రెడిట్ మొత్తం ముకేశ్ అంబానీది మాత్రమే. అంతేకాదు.. 2001-2002 ఆర్థిక సంవత్సరంలో.. 45 వేల 411 కోట్లుగా ఉన్న ఆదాయం.. గత ఆర్థిక సంవత్సరం నాటికి 7 లక్షల 92 వేల 756 కోట్లకు చేరింది. ఏటా 15 శాతానికి పైగా వార్షిక వృద్ధి నమోదైంది. నెట్ ప్రాఫిట్ 16.3 శాతం వార్షిక వృద్ధి రేటుతో.. 3 వేల 280 కోట్ల నుంచి 67 వేల 845 కోట్లకు పెరిగింది. ఎగుమతులు కూడా ఏటా 17 శాతం పెరిగి.. 11 వేల 2 వందల కోట్ల నుంచి 2 లక్షల 54 వేల 970 కోట్లకు చేరాయి. ఈ నెంబర్స్ చాలు.. ముకేశ్ అంబానీ ఎంత పక్కా బిజినెస్‌మ్యానో చెప్పడానికి! వ్యాపారం విషయంలో ఆయనకున్న కమిట్‌మెంట్ ఏ పాటిదో అర్థం చేసుకోవడానికి!

Mukesh Ambani 20 years Reliance : భారత్‌లో రిలయన్స్ డేటా రెవల్యూషన్..ఒక్క నిర్ణయంతో దేశాన్ని స్మార్ట్ ఇండియాగా మార్చేసిన ముఖేశ్ అంబానీ

తన 20 ఏళ్ల వ్యాపార ప్రస్థానంలో.. ముకేశ్ అంబానీ ఆస్తులు ఏడాదికి దాదాపు 19 శాతం లెక్కన ఎగబాకి.. 48 వేల 987 కోట్ల నుంచి దాదాపు 15 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ రెండు దశాబ్దాల్లో.. రిలయన్స్ ఇన్వెస్ట్‌ చేసిన ఇన్వెస్టర్ల సంపద కూడా 17 లక్షల 40 వేల కోట్లకు చేరింది. ఏటా.. 87 వేల కోట్లు వృద్ధి చెందడం మరో విశేషం. ఓ సర్వే ప్రకారం.. 2016 నుంచి 2020 మధ్య అత్యధిక సంపదను సృష్టించిన కంపెనీగా రిలయన్స్ అవతరించింది. ఈ నాలుగేళ్లలో.. 10 లక్షల కోట్ల సంపదను.. ఇన్వెస్టర్లకు అందించింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ విషయంలో.. రిలయన్స్ తన రికార్డును తానే తిరగరాసింది. అంతేకాదు.. రిలయన్స్ పగ్గాలు తన చేతుల్లోకి వచ్చాక.. దాన్ని అప్పుల్లేని సంస్థగా మార్చడంలోనూ ముకేశ్ సక్సెస్ అయ్యారు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని.. గడిచిన 2 దశాబ్దాల్లో ఇతర రంగాలకు కూడా విస్తరించారు ముకేశ్ అంబానీ. 2016లో.. జియో ద్వారా టెలికాం రంగంలోకి ప్రవేశించి.. తిరుగులేని సంస్థగా నిలిపారు. అలాగే.. 2006లో రిటైల్‌ రంగంలోకీ అడుగు పెట్టారు. వివిధ కంపెనీల కొనుగోలుతో.. ఈ మధ్య కాలంలో రిటైల్ సెక్టార్‌ విస్తరణలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు.. గతేడాది న్యూ ఎనర్జీ రంగంలోకీ ప్రవేశించారు. అందులోనూ.. వివిధ కంపెనీల కొనుగోళ్లు, పార్ట్‌నర్‌షిప్‌లతో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఎకో-ఫ్రెండ్లీ ఎనర్జీపై ఫోకస్ పెట్టారు.

2002లో సింగిల్‌ ఆయిల్‌ రిఫైనరీగా ఉన్న జామ్‌నగర్‌ చమురు శుద్ధి కేంద్రం.. ఇప్పుడు ప్రపంచంలోనే.. ఒకే ప్రదేశంలో ఉన్న అతిపెద్ద ఆయిర్ రిఫైనరీ కేంద్రంగా అవతరించింది. అంతేకాదు.. 20 ఏళ్లలో రిలయన్స్‌ చమురు శుద్ధి సామర్థ్యం రెండింతలైంది. సంప్రదాయంగా వస్తున్న ఈ వ్యాపారాన్ని.. ముకేశ్‌ ఊహించిన దానికన్నా ఎక్కువగా విస్తరించారు. ఇక.. రిలయన్స్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ వ్యాపారం.. తొలిసారి 2002లో హైడ్రోకార్బన్‌ను గుర్తించింది. 2009 నుంచి ఉత్పత్తిని ప్రారంభించింది. బ్రిటన్‌కు చెందిన బీపీ కంపెనీ ఈ బిజినెస్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇటీవలే.. ఈ కంపెనీ రెండో ప్రాంతంలోనూ ఉత్పత్తి ప్రారంభించింది. తర్వాత.. బీపీ కంపెనీని.. రిలయన్స్‌ భారత చమురు రిటైల్‌ వ్యాపారంలోకీ తీసుకొచ్చింది. భాగస్వామ్యంలో.. పెట్రోల్‌ బంకులను.. ఛార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలుగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయ్.

ఇక.. న్యూ ఎనర్జీ రంగంలో వేగంగా దూసుకెళ్తున్న రిలయన్స్.. రాబోయే మూడేళ్లలో 75 వేల కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో.. జామ్‌నగర్‌లో ఐదు గిగా ఫ్యాక్టరీలను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే తొలిసారి క్యార్బ్ – టు మాడ్యూల్ సోలార్ ప్యానెల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఫైనల్‌గా.. ప్రపంచంలోనే అత్యంత చౌకైన సోలార్ పవర్, ఎకో-ఫ్రెండ్లీ ఇంధనాన్ని అందించడమే లక్ష్యంగా ముకేశ్ అంబానీ దూసుకెళ్తున్నారు. 2035 నాటికి.. కర్బన ఉద్గార తటస్థ కంపెనీగా రిలయన్స్‌ను మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రిలయన్స్ బాధ్యతలు స్వీకరించిన 20 ఏళ్లలో.. కంపెనీ ఆదాయాలు, లాభాలు, నికర విలువ, ఆస్తులు, మార్కెట్ క్యాపిటలైజేషన్.. ఇలా ప్రతి దాంట్లో.. స్థిరమైన, బలమైన రెండంకెల వృద్ధిని సాధించడం వెనకున్న.. వన్ అండ్ ఓన్లీ మాస్టర్ మైండ్ ముకేశ్ అంబానీ.