Covid Patients in 5 star hotels : కరోనా రోగులకు ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌లో చికిత్స‌..

Covid Patients in 5 star hotels : కరోనా రోగులకు ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌లో చికిత్స‌..

Treatment Of Covid Patients In Five Star Hotels

Updated On : April 15, 2021 / 1:45 PM IST

Treatment of covid Patients in five star hotels : మహారాష్ట్రలో కరోనా కల్లోలం రేపుతోంది. ముఖ్యంగా జనారణ్యం అయిన ముంబైలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కూడా ప్రతాపం తీవ్రస్థాయిలో ఉంది. దీంతో హాస్పిటల్స్ అన్నీ కోవిడ్ షేషెంట్లతో నిండిపోయాయి. బెడ్లు కూడా లేని పరిస్థితి నెలకొంది. రోజురోజుకూ క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోతుండ‌టంతో ముంబై మ‌హాన‌గ‌ర పాల‌క సంస్థ కీల‌క నిర్ణ‌యం తీసుకుం‌ది.

గురువారం (ఏప్రిల్ 15,2021) నుంచి ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు అనుసంధానంగా ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌లోనూ కొవిడ్ పేషెంట్ల‌కు చికిత్స అందించాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతానికి రెండు స్టార్ హోటళ్లను దీనికోసం సిద్ధం చేశారు. ప్రైవేటు ఆసుప‌త్రులు ఫోర్ లేదా ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌తో ముంబై మ‌హాన‌గ‌ర పాల‌క సంస్థ ఒప్పందం చేసుకుని కోవిడ్ పేషెంట్లకు చికిత్సనందించాలనుకుంటోంది. అత్య‌వ‌స‌ర చికిత్స అవ‌స‌రం లేని పేషెంట్ల‌ను ఆసుప‌త్రుల నుంచి హోట‌ళ్ల‌కు త‌ర‌లించ‌నున్నారు. పెద్ద‌గా చికిత్స అవ‌స‌రం లేని పేషెంట్ల కోసం ప్రైవేట్ హాస్పిట‌ల్స్‌కు ఈ హోట‌ళ్లు అనుసంధానంగా ప‌ని చేస్తాయ‌ని బృహ‌న్‌ముంబై మున్సిప‌ల్ కార్పొరేషన్ (BMC) తెలిపింది. ఇటువంటి హోట‌ళ్ల‌లో క‌నీసం 20 గ‌దులు కొవిడ్ పేషెంట్ల కోసం 24 గంట‌లూ పేషెంట్లకు వైద్య సేవ‌లు అందుబాటులో ఉండాలి.

ఇటువంటి సౌకర్యాలు క‌ల్పించ‌డానికి హాస్పిట‌ల్స్ రోజుకు ఒక్కో రూమ్ కు రూ.4 వేల నుంచి రూ.6 వేల వ‌ర‌కూ వ‌సూలు చేయ‌నుందని బీఎంసీ తెలిపింది. ల‌క్ష‌ణాలు లేని కొవిడ్ పేషెంట్లు కూడా వీటిని ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని..హాస్పిట‌ల్‌లో చికిత్స అవ‌స‌ర‌మైన అంద‌రికీ అవి అందుబాటులో ఉంచే ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. దేశంలో ఇప్ప‌టికే స‌గం వ‌ర‌కూ కేసులు ఒక్క మ‌హారాష్ట్ర‌లోనే న‌మోదువుతున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా ముంబై మహానగరంలో ఈ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.