Narayana Murthy : రైతుల కంటే యువత మరింత కష్టపడాలి.. వారానికి 70 గంటల పని వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన నారాయణమూర్తి
వారానికి 70 గంటల పని వ్యాఖ్యలపై మరోసారి మాట్లాడారు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. తన భార్యతో కలసి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.

Narayana Murthy
Narayana Murthy : ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి కొద్దిరోజుల క్రితం భారత్‌లో యువత వారానికి 70 గంటలు పనిచేయాలంటూ చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు, విమర్శలకు దారి తీసాయి ఈ వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు నారాయణమూర్తి. తన భార్య సుధామూర్తితో ఇటీవల పాల్గొన్న ఇంటర్వ్యూలో మళ్లీ ప్రస్తావించారు.
అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాలని కొన్నాళ్ల క్రితం నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసాయి. కొందరు ఉద్యోగంలో ఉండే సమస్యల గురించి ప్రస్తావిస్తే మరికొందరు మానసిక ఆరోగ్యంపై ఎక్కువ గంటల పని తీవ్ర ప్రభావం చూపిస్తుందని మాట్లాడారు.
కాగా ఇవే వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు నారాయణమూర్తి. ఒక మీడియాకు భార్య సుధామూర్తితో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణమూర్తి ఈ అంశంపై మాట్లాడారు. కష్టపడి పనిచేసే రైతులు, ఫ్యాక్టరీ కార్మికులు మరియు సబ్సిడీ ద్వారా విద్యావంతులైన యువత మధ్య తేడాను చెప్పుకొచ్చారు. రైతుల కంటే యువత మరింత కష్టపడాలని సూచించారు. చైనా వంటి ఆర్ధిక శక్తులతో పోటీ పడాలంటే భారత్‌కు అలాంటి అంకిత భావం అవసరమని నొక్కి చెప్పారు.
1981 లో ఇన్ఫోసిస్ కో-ఫౌండర్‌గా ఉన్న నారాయణమూర్తి వారానికి 85 నుండి 90 గంటల సమయం తమ సంస్థలోనే గడిపేవారట. తన కఠినమైన వర్క్ షెడ్యూల్ తన విజయానికి దోహదపడిందని ఆయన చెప్పారు. సుధామూర్తి మాట్లాడుతూ తాను డాక్టర్ల కుటుంబం నుండి వచ్చానని.. తన తండ్రి వారానికి 70 గంటలు పనిచేసేవారని చెప్పారు. భారతదేశం ఉత్పాదకత పెరిగి పురోగతి సాధించాలంటే యువత కృషి చేయాలంటూ నారాయణమూర్తి మరోసారి యువతకు ఇచ్చిన మెసేజ్ వైరల్ అవుతోంది.