Prashant Kishor: జనం మెచ్చిన నేత మోడీ.. ప్రశాంత్ కిషోర్ ప్రశంసలు

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ ప్రధాని మోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలు మెచ్చిన నేత అని, అందుకే ప్రధాని పదవిలో ఉన్నారని ప్రశాంత్ కిశోర్ ప్రశంసించారు.

Prashant Kishor: జనం మెచ్చిన నేత మోడీ.. ప్రశాంత్ కిషోర్ ప్రశంసలు

Prashanth Kishor

Updated On : April 12, 2021 / 4:33 PM IST

Prashant Kishor: దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యూహాల్లో పేరున్న ప్రశాంత్ కిషోర్.. ప్రధాని నరేంద్ర మోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీపై ప్రశంసలు కురిపించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలు మెచ్చిన నేత అని, అందుకే ప్రధాని పదవిలో ఉన్నారని ప్రశాంత్ కిషార్ అన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దని, తాను కూడా ఎవరినీ తక్కువ అంచనా వేయమని కిషోర్ అన్నారు.

ఇదే సమయంలో బెంగాల్ ఎన్నికలపై మాట్లాడుతూ.. బీజేపీకి 100 సీట్లు కూడా దాటవని తిరిగి మమతానే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. లేటెస్ట్‌గా లీకైన ఆడియో టేప్‌లపై స్పందిస్తూ.. ఆడియో టేపుల్లో ఉన్నట్లు తాను వ్యాఖ్యానించలేదని అన్నారు. కోచ్‌‌ బీహార్‌లో జరిగిన కాల్పులపై స్పందిస్తూ.. కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారని.. సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించాలనుకున్న సీఎం మమతను అడ్డుకున్నారని చెప్పుకొచ్చారు.

ఒక సీఎంగా కాల్పులు జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించే హక్కు మమతకు ఉందని, కానీ ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వలేదని అన్నారు. 2014లో పాట్నాలో జరిగితే ప్రధాని మోడీ వెళ్లి సంఘటనలో గాయపడిన వారిని కలిశారని ప్రశాంత్ కిషోర్ గుర్తు చేశారు. అప్పుడు మోడీని అడ్డుకొని ఎన్నికల కమిషన్.. ఇప్పుడు మమతకు అడ్డుపడుతోందని అన్నారు. మమతకు పేదలు, మైనారిటీలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయని.. వారు ఆమెకు అండగా ఉంటారని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.