నాసిక్ ఆక్సిజన్ లీక్ దుర్ఘటనపై మోడీ,షా దిగ్భ్రాంతి
ఆ దుర్ఘటన గుండెను పిండేసే అంతటి విషాదకర ఘటన అని ప్రధాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Oxygen Leak
oxygen leak మహారాష్ట్రలోని నాసిక్ లోని జకీర్ హుస్సేన్ హాస్పిటల్ లో బుధవారం ఆక్సిజన్ ట్యాంకర్ లీక్ కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులకు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో 22 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆ దుర్ఘటన గుండెను పిండేసే అంతటి విషాదకర ఘటన అని ప్రధాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర మనోవేదన కలిగించిందని ట్వీట్ చేశారు. ఇలాంటి విషాద ఘడియలో మృతుల కుటుంబాలకు తాను ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నాసిక్‌లోని ఆసుపత్రిలో జరిగిన దుర్ఘటన వార్త కలచివేసిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. అత్యంత ఆత్మీయులను కోల్పోవడం వల్ల జరిగిన నష్టాన్ని ఎన్నటికీ పూడ్చడం సాధ్యంకాదని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. చికిత్స పొందుతున్నవారంతా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
నాసిక్ నుంచి చాలా దుర్వార్త అందిందని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలగడంతో విలువైన ప్రాణాలకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాద సంఘటనలో కొందరు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ బాధాకర సమయంలో తీవ్ర ఆవేదనకు గురైన బాధిత కుటుంబాలకు సంఘీభావం ప్రకటించారు.
నాసిన్ ఘటన దురదృష్టకరమని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే అన్నారు. పరిస్థితిపై నాసిక్ మున్సిపల్ కమిషనర్ మాట్లాడానని, ప్రస్తుతానికి అంతా అదుపులోనే ఉందని ఆయన పేర్కొన్నారు.తాను నాసిక్ బయల్దేరి వెళ్తున్నట్లు తెలిపారు. స్థానిక మంత్రి చాగన్ భుజ్‌బల్ ఇప్పటికే ఘటనాస్థలానికి చేరుకున్నారని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని మంత్రి రాజేశ్ తోపే చెప్పారు.