ప్రైవేటు జెట్‌లో ఢిల్లీకి 8మంది NCP రెబల్ ఎమ్మెల్యేలు

మహారాష్ట్రలో నెంబర్ గేమ్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ సపోర్టుతో రాత్రికి రాత్రే బీజేపీ అధికారి పీఠం చేజిక్కించుకుంది. బీజేపీని బలపరీక్షలో దెబ్బకొట్టేందుకు ఎన్సీపీ పావులు కదుపుతోంది. నెంబర్ గేమ్ మొదలైంది. బలబలాలను తేల్చుకునేందుకు పోటీపడుతున్నాయి.
ఇప్పటికే అజిత్ బీజేపీకి మద్దతు పలకడంతో ఆయన వర్గమంతా కమలం గూటికి వెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తమ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలపై ఎన్సీపీ ఓ కన్నేసి ఉంచింది. తమ చేతి నుంచి జారిపోకుండా ఆచితూచి అడుగులు వేస్తోంది. అజిత్ పవార్ తో పాటు వెళ్లేందుకు 9 మంది ఎన్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.
వీరిలో దౌలత్ డరోడా, నరహరి జిర్వార్, సునీల్ భుశారా, అనిల్ భాయిదాస్ పాటిల్, నితిన్ పవార్, సునీల్ షెల్కి, బాబాసాహెబ్ పాటిల్, సంజయ్ బన్సాన్ లను హుటాహుటినా ప్రైవేట్ జెట్‌లో ఢిల్లీకి ఎన్సీపీ తరలించినట్టు ఓ రిపోర్టు తెలిపింది. ఎయిర్ పోర్టులో 8వ గేట్ నెంబర్ దగ్గర ఎన్సీపీ మద్దతుదారులంతా భారీ సంఖ్యలో తరలివచ్చారు. అజిత్ పవార్, బీజేపీకి మద్దుతును పలికే రెబల్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్.. తన సోదరుడి కొడుకు అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలిపినందుకు అతడిపై క్రమశిక్షణ చర్యల కింద పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. మరోవైపు మహారాష్ట్రలో మరోసారి రీసార్ట్ రాజకీయం మొదలైనట్టు కనిపిస్తోంది.
బీజేపీ గాలానికి చిక్కకుండా తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు మహారాష్ట్రలో 44మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ మధ్యప్రదేశ్ లోని భూపాల్ రీసార్ట్ కు తరలిస్తోంది. శివసేన కూడా తమ ఎమ్మెల్యేలను జైపూర్ కు తరలిస్తున్నట్టు సమాచారం.