కాంగ్రెస్‌కి షాక్ : సొంతంగా బరిలోకి NCP

  • Published By: madhu ,Published On : March 30, 2019 / 02:46 AM IST
కాంగ్రెస్‌కి షాక్ : సొంతంగా బరిలోకి NCP

Updated On : March 30, 2019 / 2:46 AM IST

మరాఠా వృధ్ద నేత శరద్ పవార్ కాంగ్రెస్‌కి ఉన్నట్లుండి గుగ్లీ వేశారు. మహారాష్ట్రలో కలిసి కూటమిగా పోటీ చేస్తోన్న తరుణంలో సడన్‌గా గుజరాత్‌లో 26 సీట్లకూ అభ్యర్ధులను దింపనున్నట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌ షాక్‌లో పడిపోయింది. ఇక్కడ నామినేషన్లు వేయడానికి ఏప్రిల్ 4  చివరి తేదీ. ఆలోగా రెండు పార్టీలు మళ్లీ ఒకటయ్యే ఛాన్స్ ఉఁదంటున్నారు కానీ…ప్రస్తుతం NCP నేత మనసు ఎందుకు మారిందో తెలీక కాంగ్రెస్ నేతలు జుట్టు పీక్కుంటున్నారు. ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పటేల్ మాత్రం 26మంది అభ్యర్ధులనీ ఒకట్రెండు రోజుల్లో  ప్రకటిస్తామని చెప్తున్నారు. పోర్‌బందర్, పంచమహల్, గాంధీనగర్‌ సీట్లు కావాలని ఎన్సీపీ..కాంగ్రెస్‌ని కోరినట్లు సమాచారం. 

ఈ  రెండు పార్టీల మధ్య 2004, 2014లో పొత్తు నడిచింది. గత నాలుగు దఫాలుగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎన్ని సీట్లలో పోటీ చేసినా ఒక్కటీ గెలవలేదు. 2017 ఎన్నికలలో 58 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసి చివరికి ఒక్క సీటులో మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ గెలవాల్సిన ఐదు సీట్లలో అడ్డుపడింది. ఈ మధ్యనే మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింఘ్ వాఘేలా ఎన్సీపీలో చేరారు. ఆయన  ప్రోద్బలంతోనే గుజరాత్ ఎంపీ ఎన్నికలలో శరద్ పవార్ సొంతంగా పోటీకి అభ్యర్ధులు దింపుతున్నారనే వాదన ఉంది. ఎన్సీపీ – కాంగ్రెస్ పోరు కాస్తా..బిజెపికి సీట్లు పెంచుతుంది అని భావిస్తున్నారు. నోటిదాకా వచ్చిన కూడు నేలపాలవుతుందేమో అన్నట్లు కాంగ్రెస్ బెంబేలెత్తుతోంది.