ఇండియా కూటమిలో కలకలం.. బీజేపీలోకి మాజీ సీఎం కమల్‌నాథ్‌? ఏం జరుగుతుందో తెలుసా?

NDA Vs INDIA: ఒక్కొక్కరుగా అలయెన్స్‌ను వీడుతూ కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు.

ఇండియా కూటమిలో కలకలం.. బీజేపీలోకి మాజీ సీఎం కమల్‌నాథ్‌? ఏం జరుగుతుందో తెలుసా?

NDA VS INDIA

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇండియా కూటమికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే అలయెన్స్‌లోని పలు పార్టీలు సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించగా.. మరికొందరు ఎన్డీయే కూటమిలో చేరిపోయారు. తాజాగా.. మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌, ఆయన కుమారుడు బీజేపీలో చేరనున్నారనే వార్తలతో కూటమిలో కలకలం రేగింది. మరోవైపు.. ఇన్నాళ్లూ కాంగ్రెస్‌తో కలిసి ఉన్న బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌.. ఇండియా కూటమి కథ ఎప్పుడో ముగిసిందంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

కేంద్రంలో మోదీ సర్కారు ఓటమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమికి వరుస దెబ్బలు తగుతులున్నాయి. కూటమిలో ఉన్న పార్టీలు ఒక్కొక్కటిగా హ్యాండ్‌ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్‌లో జయంత్‌ చౌదరి, పంజాబ్‌లో భగవంత్‌మాన్‌, జమ్మూకశ్మీర్‌లో ఫరూక్‌ అబ్దుల్లా ఇండియా కూటమికి బిగ్‌ షాక్‌ ఇచ్చారు. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించడంతో పాటు బీజేపీతో జత కట్టే అవకాశమున్నట్లు పరోక్షంగా హింట్‌ ఇచ్చింది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో కూడా సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీల మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.

ఇక.. ఇన్నాళ్లూ కూటమిలో కీలకంగా ఉన్న బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ ఏకంగా కాంగ్రెస్‌కు కటీఫ్‌ చెప్పేసి.. ఎన్డీఏతో జట్టు కట్టారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌ చవాన్‌ సైతం ఆ పార్టీని వీడారు. ఆయన బీజేపీలో చేరిన రెండు రోజులకే రాజ్యసభ సీటు కట్టబెట్టింది బీజేపీ.

ఉన్నట్టుండి కమల్‌నాథ్ షాక్
ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. పార్టీ అధిష్టానంపై కోపంతో ఉన్న మాజీ సీఎం కమల్‌నాథ్‌, ఆయన కుమారుడు బీజేపీలో చేరుతారన్న వార్తలు ఊపందుకున్నాయి.

ఈ క్రమంలోనే కమల్‌నాథ్ మాజీ మీడియా ప్రతినిధి నరేంద్ర సలుజా జై శ్రీరాం పేరిట కమల్‌నాథ్, నకుల్‌నాథ్‌ ఫొటో షేర్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనికితోడు నకుల్‌నాథ్‌ సైతం తన ఎక్స్‌ ఖాతా ప్రొఫైల్‌ నుంచి కాంగ్రెస్‌ పదాన్ని తొలగించారు. దీంతో వీరిద్దరూ వారిద్దరూ కాంగ్రెస్ పార్టీ వీడటం ఖాయం అన్న వాదనలకు బలం చేకూరింది.

అయితే.. కమల్‌నాథ్‌ కాంగ్రెస్‌ పార్టీని ఎప్పుడూ వీడరని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌. శుక్రవారం రాత్రి సైతం తాను కమల్‌నాథ్‌తో మాట్లాడానని.. ఆయన చింద్వారాలోనే ఉన్నారన్నారు. తొలి నుంచీ నెహ్రూ, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న కమల్‌నాథ్‌ బీజేపీలో చేరే అవకాశమే లేదన్నారు దిగ్విజయ్‌.

అలయెన్స్‌ కథ ఎప్పుడో ముగిసిందంటూ..
మరోవైపు.. ఇటీవలే ఎన్డీయేలో చేరిన బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ ఇండియా కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అలయెన్స్‌ కథ ఎప్పుడో ముగిసిందన్న ఆయన.. అందులోంచి బయటకు వచ్చే పార్టీలు చాలానే ఉన్నాయన్నారు. ఇండియా కూటమిని బలంగా ఉంచేందుకు తాను చాలా ప్రయత్నించానన్న ఆయన.. ఇప్పుడు దాని పని అయిపోయిందన్నారు.

మొత్తంగా.. ఎన్నో ఆశలతో ఏర్పడిన ఇండియా కూటమి పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా తయారైంది. ఒక్కొక్కరుగా అలయెన్స్‌ను వీడుతూ వెళ్లిపోవడం కాంగ్రెస్‌కు పెద్ద షాక్‌లా మారింది.

Read Also: తెలంగాణలో పొత్తులపై కుండబద్దలు కొట్టినట్లు క్లారిటీ ఇచ్చేసిన కిషన్ రెడ్డి