ఉరి అమలు వాయిదాపై సీఎం అసహనం

నూరు మంది దోషులు తప్పించుకున్నా కూడా ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అనే ప్రాధమిక న్యాయసూత్రం.. నేరస్తులకు అస్త్రంగా మారిపోయింది. ఇదే ఇప్పుడు నిర్భయ దోషుల ఉరికి ఆటంకాలు కలిగిస్తుంది. నిర్భయ దోషులకు యమపాశం దగ్గర కానివ్వకుండా చేస్తుంది. నిర్భయ దోషుల ఉరిపై ఢిల్లీ కోర్టు మళ్లీ ఇవాళ(31 జనవరి 2020) స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిర్భయ దోషులకు ఉరితీయొద్దంటూ ఆదేశించింది.
చట్టం తెలిస్తే చాలు ఉరి పడకుండా చెయ్యడానికి ఎన్నో లొసుగులు.. ఆ లొసుగులే ఇప్పుడు నిర్భయ దోషులకు రక్షణ కవచంలా మారింది. భారతజాతి మొత్తం ఎదురుచూస్తున్నా కూడా.. ఉరి శిక్ష ఖరారై, ఉరి తాడు పేనడం పూర్తయి, తలారి దొరికి, ఉరి కంబం పిలుస్తున్నా ఉరి మాత్రం అప్పుడే కాదు అంటుంది. అందుకు కారణం చట్టం. ఇదే విషయంపై దేశం యావత్తు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
లేటెస్ట్‌గా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కూడా అసహనం వ్యక్తం చేశారు. చట్టపరంగా ఉన్న లొసుగులు ఉపయోగించుకుని నిర్భయ దోషులు ఉరిశిక్ష అమలు నుంచి తప్పించుకోవాలని చూస్తుండడం దారుణమని కేజ్రీవాల్ అన్నారు. నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడగా.. అత్యాచార కేసుల్లో దోషులకు ఆరు నెలల్లోనే శిక్ష పడేలా చట్టాలు సవరించాల్సిన అవసరముందని, దీనిపై సత్వరమే చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సైతం ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం కూడా ఇలాంటి దారుణ నేరాలకు పాల్పడిన వారు మరణశిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తుండడంపై చర్చ జరగాలన్నారు.