Nithyananda: ఆ దేశంలోనూ భూముల ఆక్రమణకు నిత్యానంద ప్రయత్నాలు.. చివరకు పోలీసులు వచ్చి..
న్యూస్ వార్త పత్రికలో రావడంతో అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

Nithyananda
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరో వివాదంలో ఇరుక్కున్నారు. బొలీవియా దేశంలో ఆయన శిష్యులు భూ ఆక్రమణలకు ప్రయత్నించినందుకు వారిని పోలీసులు అరెస్టు చేశారు. భారత్‌లో లైంగిక వేధింపుల కేసులు ఎదుర్కొన్న నిత్యానంద ఇక్కడి నుంచి పారిపోయిన విషయం తెలిసిందే.
ఈక్వెడార్ సమీపంలో ఓ చిన్న దీవిని కొన్నానని, కైలాస పేరుతో దేశాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఉంటున్నట్లు నిత్యానంద చాలా కాలం క్రితం తెలిపారు. బొలీవియా దేశంలో స్థానిక తెగలతో అతడు భూమి లీజు కోసం అగ్రిమెంట్లు చేసుకున్నాడని పోలీసులు గుర్తించారు. దీంతో కైలాస నుంచి 20 మంది నిత్యానంద శిష్యులను అరెస్టు చేసి వారి సొంత దేశాలకు వారిని పంపించారు.
కొన్ని రోజుల క్రితం కైలాస నుంచి కొందరు నిత్యానంద శిష్యులు బొలీవియాలో వెళ్లి కార్చిచ్చును ఎదుర్కోవడానికి స్థానికులకు సాయపడ్డారు. ఆ సమయంలోనే అక్కడి భూమిని కొట్టేయాలన్న ఆలోచన వారిలో వచ్చింది.
భూమి లీజు కోసం స్థానికులతో ఒప్పందాలు చేసుకుని, కుట్రపూరితంగా 1000 ఏళ్ల లీజు, గగనతల వినియోగం సహా సహజ వనరుల తవ్వకం వంటి ప్రతిపాదనలు చేశారు. ఈ న్యూస్ వార్త పత్రికలో రావడంతో అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయా ఒప్పందాలను రద్దు చేసింది.
Trump tariff: దెబ్బకు దెబ్బ.. అమెరికా మీద చైనా టారిఫ్… ఇప్పుడు ఉన్నదానికంటే అదనంగా..
నిత్యానంద ఎవరు?
నిత్యానంద తమిళనాడులోని తిరువణ్ణామలైలో జన్మించారు. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు అరుణాచలం రాజశేఖరన్. తాను సన్యాసిగా మారి తిరుగుతున్న వేళ మహావతార్ బాబా తన పేరు మార్చారని, నిత్యానందగా పెట్టారని ఆయనకు ఆయనే చెప్పుకున్నారు. 2003లో కర్ణాటకలోని బిదాడిలో ఆయన ధ్యానపీఠం నెలకొల్పి, తనకు 12 ఏళ్ల వయసులోనే జ్ఞానోదయం అయిందని బాగా ప్రచారం చేసుకున్నారు.
అందులోనే ప్రవచనాలు చెప్పి, భక్తులను బాగా ఆకర్షించారు. అనేక దేశాల్లో ఆయన ధ్యానపీఠం కార్యక్రమాలు జరిపారు. 2010లో నిత్యానంద బండారం బయటపడింది. సినీ నటి రంజితతో కలిసి ఆయన ప్రైవేటుగా ఉన్న వీడియో బయటకు వచ్చింది. అది లైంగిక వాంఛను తీర్చుకోవడం కాదని, తాము శవాసనం వేశామని అప్పట్లో నిత్యానంద చెప్పుకొచ్చారు.
ఈ కేసులో ఆయనకు కొంత కాలం తర్వాత బెయిల్ వచ్చింది. మైనర్ బాలికలను నిత్యానంద ఆశ్రమంలో ఉంచి, వేధిస్తున్నారని 2019లో ఆయనపై అహ్మదాబాద్‌లో కేసు నమోదైంది. దీంతో నిత్యానంద భారత్ విడిచి పారిపోయారు. కొద్ది కాలం తర్వాత ఈక్వెడార్ ఐలాండ్‌లో ఆయన రిపబ్లిక్ ఆఫ్ కైలాసను స్థాపించినట్లు ప్రకటించుకున్నారు. అది హిందూ దేశమని చెప్పారు.