నితీష్ ని జైలుకి పంపడం ఖాయం…చిరాగ్ పాశ్వాన్

Nitish Kumar will be behind bars if LJP voted to power బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ (LJP) అధికారంలోకి వస్తే… సీఎం నితీశ్ కుమార్ జైలుకెళ్లడం ఖాయమని ఆ పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ఆదివారం బక్సర్‌లోని దుమ్రాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చిరాగ్ పాశ్వాన్…. నితీశ్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మద్యం రద్దు విఫలమైందని నితీష్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అక్రమ మద్యం అమ్మకాల ద్వారా సీఎం నితీశ్ కుమార్‌కు ముడుపులు అందుతున్నాయని చిరాగ్ ఆరోపించారు.
బీహార్ ఫస్ట్ కోసం ప్రతి ఒక్కరు ఎల్జేపీకి లేదా బీజేపీకి ఓటు వేయాలని, నితీశ్ లేని ప్రభుత్వం కోసం సహకరించాలని ఓటర్లను కోరారు. LJP అధికారంలోకి వస్తే నితీష్…తప్పకుండా జైలు ఊచలు లెక్కబెడతాడని,అతని అధికారులు కూడా జైలుకెళ్లడం తథ్యం అని చిరాగ్ పాశ్వన్ అన్నారు.
కాగా,బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ వైఖరితో ఈసారి బీజేపీ ఓటర్లు తీవ్ర గందరగోళంలో ఉన్నారు. ఎన్టీయే కూటమి నుంచి తప్పుకుని సొంతంగా పోటీ చేస్తున్నప్పటికీ… తాము ఇప్పటికీ బీజేపీ మిత్రపక్షమే అన్నట్లుగా వ్యవహరిస్తోంది లోక్ జనశక్తి పార్టీ. పైగా బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న జేడీయూని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. జేడీయూ అధినేత,సీఎం నితీశ్ కుమార్ కి చెక్ పెట్టేందుకు బీజేపీయే ఎల్‌జేపీని “బీ” టీమ్ గా బరిలో దింపిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
పైకి ఇరు పార్టీ నేతల ఈ ఆరోపణలను ఖండిస్తున్నప్పటికీ… చిరాగ్ పాశ్వాన్ చేస్తున్న ప్రకటనలు,ఆయన రాజకీయ వ్యవహార శైలి బీజేపీ ఓటర్లను గందరగోళానికి గురిచేస్తోంది. ఈ గందరగోళాన్ని మరింత పెంచేలా బీజేపీ ఓటర్లు సైతం ఎల్‌జేపీకే ఓటేయాలని తాజాగా చిరాగ్ పిలుపునివ్వడం గమనార్హం.
బీహార్ ఫస్ట్ బీహారీఫస్ట్ నినాదాన్ని నిజం చేయాలంటే బీజేపీ ఓటర్లు ఎల్‌జేపీకే ఓటేయాలని చిరాగ్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఎల్‌జేపీ అభ్యర్థులు పోటీలో లేని చోట బీజేపీకి ఓటేయండి. రాబోయే ప్రభుత్వం నితీశ్ కుమార్ లేని ప్రభుత్వం…అని చిరాగ్ పాశ్వాన్ ఆదివారం ట్వీట్ చేశారు. ఎన్నికల తర్వాత బీజేపీ నితీశ్‌ను పక్కనపెట్టి.. ఎల్‌జేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అన్న సందేహాలకు ఊతమిచ్చేలా చిరాగ్ ట్వీట్ కనిపిస్తోంది.