ఏ రాష్ట్రానికి ‘పౌరసత్వం’ అమలును తిరస్కరించే అధికారం లేదు

పౌరసత్వ సవరణ బిల్లు 2019 చట్టాన్ని తిరస్కరించే అధికారం దేశంలోని ఏ రాష్ట్రానికి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ కేంద్ర జాబితా క్రింద ఈ చట్టం అమల్లోకి వచ్చినందున ఈ కొత్త చట్టం, 2019 ను అమలు చేయడానికి ఏ రాష్ట్రం నిరాకరించలేదని హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
పశ్చిమ బెంగాల్, పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ ఐదు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులంతా ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, తమ రాష్ట్రాల్లో అనుమతించేది లేదని వ్యతిరేకించిన తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ఈ ప్రకటన రిలీజ్ అయింది.‘కేంద్ర జాబితాలో ఉన్న ఒక కేంద్ర చట్టం అమలను నిరాకరించే అధికారాలు రాష్ట్రాలకు లేవు.
రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ కేంద్ర జాబితా క్రింద పౌరసత్వ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అమలు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది’ అని అధికారి స్పష్టం చేశారు. మరోవైపు మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ.. కేంద్ర ప్రభుత్వం వెర్రి రాజకీయాలతో దేశీయ ఆర్థిక మందగమనంపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ చట్ట సవరణ చేశారని ఆరోపించారు.
పౌరసత్వ చట్టాన్ని సవరించడంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ తమ రాష్ట్రంలో పౌరసత్వ చట్టం అమలును అనుమతించబోమని ఆమె స్పష్టం చేశారు.
చట్టం అమలుతో కాషాయ పార్టీ రాష్ట్రాలను నేలమట్టం చేయలేదని ఆమె అన్నారు. పార్లమెంటులో ఆమోదించిన పౌరసత్వ సవరణ బిల్లు 2019కి గురువారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన సమ్మతిని తెలపడంతో అది చట్టంగా రూపుదాల్చింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. ఈ కొత్త చట్టం.. అధికారిక గెజిట్స్ లో ప్రచురించడంతో అమల్లోకి వస్తుంది. అంతకుముందు సోమవారం లోక్ సభలో ఆమోదం లభించగా.. బుధవారం రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లును జారీ చేసింది.