Warning Labels: సిగరెట్ల తరహాలో సమోసా, జిలేబీలకు వార్నింగ్ లేబుల్స్..! క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
లాబీలు, క్యాంటీన్లు, కేఫ్ టేరియాస్, మీటింగ్ రూమ్స్ వంటి కార్యాలయ స్థలాలలో బోర్డులను ఉంచుతారు.

Warning Labels: సిగరెట్ల తరహాలో సమోసా, జిలేబీ, పకోడీ వంటి స్నాక్స్ కు కూడా వార్నింగ్ లేబుల్స్ ఉంటాయనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై కొంత కలకలం రేగింది. ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. తాజాగా దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. సమోసాలు, జిలేబీలు లేదా లడ్డూలు వంటి ప్రసిద్ధ భారతీయ స్నాక్స్‌లకు ఎటువంటి హెచ్చరిక లేబుళ్లను జారీ చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. భారతీయ స్నాక్స్ పై ఎటువంటి హెచ్చరిక లేబుల్స్ ఉండవని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, ప్రజల అవగాహన కోసం వివిధ సంస్థల్లో ఆయిల్-షుగర్ బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. వార్నింగ్ లేబుల్స్ ఉండవు కానీ.. సలహాతో కూడిన మాత్రమే బోర్డులు మాత్రం ఉంటాయంది.
వీధి వ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాలను లేబుల్ చేయడం లేదా టార్గెట్ చేస్తూ ఎటువంటి చర్య తీసుకోలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వార్నింగ్ లేబుల్స్ కు బదులుగా.. ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను ప్రోత్సహించే లక్ష్యంతో ఒక ఆరోగ్య సలహాను జారీ చేసింది ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
లాబీలు, క్యాంటీన్లు, కేఫ్ టేరియాస్, మీటింగ్ రూమ్స్ వంటి కార్యాలయ స్థలాలలో బోర్డులను ఉంచుతారు. చాలా ఆహారాలలో ఉండే చక్కెర, కొవ్వును ఎక్కువగా తినడం వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి అవగాహన పెంచడానికి ఈ బోర్డులు రూపొందించబడ్డాయి. ప్రజలు మెరుగైన ఆహార నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడటానికి ఈ ప్రయత్నం ఉద్దేశించబడిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. నిర్దిష్ట ఆహార పదార్థాలపై తాము దృష్టి పెట్టలేదని, మొత్తం మీద ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం తమ ఉద్దేశ్యం అని వెల్లడించింది.
Also Read: షుగర్ పేషెట్స్ జామపండ్లు తింటున్నారా? అయితే జాగ్రత్తలు తప్పవు.. ముందు ఇది తెలుసుకోండి
ఆహారం గురించి సందేశం ఇవ్వడంతో పాటు శారీరక శ్రమను పెంచే సూచనలను కూడా సలహాలో చేర్చారు. అంటే మెట్లు ఎక్కడం, నడక, పని మధ్య స్వల్ప విరామాలు తీసుకోవడం. ఇక పండ్లు, కూరగాయలు తినడం.. తక్కువ కొవ్వు ఉన్న ఆహారాలు వంటి ఆరోగ్యకరమైన భోజన ఎంపికలను ఎంచుకోవడం.
భారతదేశం గుండె జబ్బులు, ఊబకాయం, అధిక రక్తపోటు వంటి పెరుగుతున్న ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున.. ఈ ప్రయత్నం జాతీయ నాన్-కమ్యూనికబుల్ వ్యాధుల నివారణ నియంత్రణ కార్యక్రమం (NP-NCD) కింద మంత్రిత్వ శాఖ కీలక కార్యక్రమాలలో భాగం. దేశంలో ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, ఇతర జీవనశైలి సంబంధిత వ్యాధుల కేసులు పెరగడానికి ప్రధాన కారణం అతిగా నూనె, చక్కెర తినడమే.
తొలుత ఈ ప్రచారం నాగ్‌పూర్‌లో ప్రారంభం కానుంది. ఈ చొరవకు పైలట్ సైట్‌గా AIIMS నాగ్‌పూర్ ఎంపిక చేయబడింది. ఈ ప్రణాళికలో భాగంగా క్యాంపస్‌లోని కేఫ్ టేరియాలు, బహిరంగ తినే ప్రదేశాలు, ఫుడ్ కౌంటర్ల దగ్గర ప్రకాశవంతమైన, చదవడానికి సులభమైన బోర్డులను ఏర్పాటు చేస్తారు. ఎక్కువ చక్కెర, కొవ్వు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి ఈ బోర్డుల్లో తెలియజేస్తారు.