సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్ట్ లు పెడితే 5ఏళ్ల జైలు శిక్ష…పోలీస్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం

Pinarayi Vijayan On Police Act Amendment Row పోలీసు చట్టాన్ని మరింత కఠినతరంగా మార్చివేసింది కేరళ ప్రభుత్వం. సోషల్ మీడియాను కూడా పోలీసుల చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. ఇకపై సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా వ్యాఖ్యలు కనిపిస్తే.. వాటిని పోస్ట్ చేసిన నెటిజన్లకు 5ఏళ్ల జైలు శిక్ష విధించబోతోంది కేరళ ప్రభుత్వం. ఈ మేరకు పోలీసు చట్టంలో సవరణలను చేసింది. ఈ సవరణలతో కూడిన ఆర్డినెన్స్‌ను శనివారం ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆమోదించారు.
యూట్యూబ్ చానళ్లతో పాటు పలు సోషల్ మీడియా వేదికల ద్వారా తమను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ కొంత మంది మహిళలు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. వీటిని అడ్డుకునేందుకు సరైన చట్టం లేకపోవడంతో, ఇటువంటి కేసులు మరిన్ని పెరగవచ్చునని భావించిన కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం …చట్టంలో సవరణలు చేయాలన్న ప్రతిపాదనకు వచ్చింది. దీనికి సంబంధించి కేరళ పోలీసు చట్టంలో సవరణలు చేసి..గవర్నర్‌కు పంపగా.. ఆ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో సోషల్ మీడియా ద్వారా మహిళలను, యువతులను, పిల్లలు లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తులపై విచారణ జరిపేందుకు వీలుంటుంది. ఈ సంతకంతో చట్టాలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయిందని రాజ్‌భవన్ తెలిపింది.
2011లో చట్టంగా ఏర్పడిన కేరళ పోలీసు చట్టానికి..సెక్షన్ 118(ఎ) అనే కొత్త నిబంధనను చేర్చి… ఆ చట్టాన్ని మరింత బలోపేతం చేయాలన్న సిఫార్సును రాష్ట్ర మంత్రివర్గం అక్టోబర్‌లో ఆమోదం తెలిపింది. దీంతో ఈ సవరణ చోటుచేసుకుంది. కేరళ పోలీస్ చట్టంలోని సెక్షన్ 118 (ఎ) ప్రకారం.. ఏ వ్యక్తి అయినా మరొకరిని ఉద్దేశించి సోషల్ మీడియా ద్వారా బెదిరింపులకు లేదా కించపరిచేలా పోస్టులు చేస్తే.. దాన్ని నేరంగా పరిగణిస్తారు. అభ్యంతరకరంగా ఉండేలా వ్యాఖ్యలు లేదా సమాచారాన్ని ఏ సామాజిక మాధ్యమం ద్వారా అయినా ఫలానా వ్యక్తికి పంపించడం చట్ట వ్యతిరేకమౌతుంది. ఆ పోస్టు తీవ్రతను బట్టి 10 వేల రూపాయల జరినామా లేదా అయిదేళ్ల జైలుశిక్ష లేదా ఈ రెండింటినీ కలిపి విధిస్తారు. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దాడులు, వ్యక్తిత్వ హననానికి పాల్పడటాన్ని నిరోధించడానికి దీన్ని అమలు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.
కాగా,పిన్నరయి విజయన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. స్వేచ్ఛను కాలరాసినట్టవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ వ్యవహారం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టు ప్రభుత్వ అంతిమ నిర్ణయం.. ప్రజల గొంతును నొక్కడమేనని విమర్శించారు. ప్రజల తరఫున పోరాడే వామపక్ష నేతలు ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడం ఆశ్చర్యకరమని మరో కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు.
అయితే, విమర్శలను ధీటుగా తిప్పికొట్టారు సీఎం పిన్నరయి విజయన్. కేరళ పోలీస్ చట్ట సవరణను సమర్థించిన సీఎం…భావ ప్రకటనా స్వేచ్ఛకు లేదా నిస్పాక్షిక జర్నలిజానికి వ్యతిరేకంగా ఈ చట్టం ఉపయోగించబడదని ఆదివారం(నవంబర్-22,2020) తెలిపారు. వ్యక్తుల స్వేచ్ఛ మరియు గౌరవం కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. అయితే, రాజ్యాంగ పరిధిలో మీడియాపై లేదా ప్రభుత్వంపై విమర్శలు చేసే వాళ్లపై ఎటువంటి చర్యలు తీసుకోబోమని సృష్టం చేశారు.