Bihar Caste Survey: కులగణన ఫలితాలు వెల్లడించిన బిహార్ ప్రభుత్వం.. స్వాతంత్ర్య దేశంలో ఇదే మొదటి సర్వే

బీహార్‌లో అత్యధిక సంఖ్యలో హిందువులు ఉన్నారు. వీరి సంఖ్య 10,71,92,958 మంది. ఇక ముస్లింల సంఖ్య 2,31,49,925 మంది ఉండగా క్రైస్తవుల సంఖ్య 75,238, సిక్కుల సంఖ్య 14,753, బౌద్ధుల సంఖ్య 1,11,201, జైనుల సంఖ్య 12,523 మంది ఉన్నారు.

Bihar Caste Survey: కులగణన ఫలితాలు వెల్లడించిన బిహార్ ప్రభుత్వం.. స్వాతంత్ర్య దేశంలో ఇదే మొదటి సర్వే

Updated On : October 2, 2023 / 3:48 PM IST

Bihar Caste Survey Out: బీహార్‌లో నిర్వహించిన కుల ఆధారిత సర్వే నివేదిక సోమవారం విడుదలైంది. గాంధీ జయంతి సందర్భంగా బీహార్ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి వివేక్ సింగ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కుల ఆధారిత జనాభా గణన నివేదికను విడుదల చేశారు. కుల ప్రాతిపదికన జనాభా గణనపై బీహార్‌లో పెద్ద దుమారమే రేగింది. హైకోర్టు నుంచి ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.

బీహార్‌లో నిర్వహించిన కుల ఆధారిత జనాభా గణన నివేదిక ప్రకారం, రాష్ట్రంలో వెనుకబడిన తరగతి 27.13% మంది ఉన్నారు. ఇక అత్యంత వెనుకబడిన తరగతి 36.01%, జనరల్ తరగతి 15.52% మంది ఉన్నారు. బీహార్ మొత్తం జనాభా 13 కోట్ల కంటే ఎక్కువ. జూన్ 1, 2022న జరిగిన అఖిలపక్ష సమావేశంలో బీహార్‌లో కుల ప్రాతిపదికన జనాభా గణనను నిర్వహించాలనే ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు అదనపు ప్రధాన కార్యదర్శి వివేక్ సింగ్ తెలిపారు. అనంతరం జూన్ 2, 2022న రాష్ట్ర మంత్రుల మండలి తీసుకున్న నిర్ణయం అనంతరం ఫిబ్రవరి 2023 నాటికి రాష్ట్రంలో రెండు దశల్లో కుల ప్రాతిపదికన జనాభా గణనను నిర్వహించాలని నిర్ణయించారు.

గణన తర్వాత బీహార్ జనాభా ఎంత?
అడిషనల్ చీఫ్ సెక్రటరీ వివేక్ సింగ్ మాట్లాడుతూ.. న్యాయంతోనే అభివృద్ధి అనే సిద్ధాంతంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మతాలు, కులాల జనాభా గణనను పూర్తి చేసిందన్నారు. బీహార్ రాష్ట్రంలో చేసిన లెక్కల ప్రకారం.. మొత్తం బీహార్ జనాభా 13 కోట్ల 7 లక్షల 25 వేల 310 అని తేలింది. ఇందులో బీహార్ వెలుపల నివసిస్తున్న వారి సంఖ్య 53,72,022. బీహార్ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజల మొత్తం జనాభా 12,53,53,288 మంది.

ఇందులో పురుషులు 6,41,31,990 మంది కాగా, మహిళల సంఖ్య 6,11,38,460 మంది. మిగతా వారి సంఖ్య 82,836గా గుర్తించారు. ప్రభుత్వ నివేదిక ప్రకారం.. బిహార్ రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషులకు 953 మంది మహిళలు ఉన్నారు. బీహార్‌లోని 2,83,44,107 కుటుంబాలను సర్వే చేశారు. కుల ఆధారిత జనాభా గణన నివేదిక ప్రకారం.. బీహార్‌లో అత్యధిక సంఖ్యలో హిందువులు ఉన్నారు. వీరి సంఖ్య 10,71,92,958 మంది. ఇక ముస్లింల సంఖ్య 2,31,49,925 మంది ఉండగా క్రైస్తవుల సంఖ్య 75,238, సిక్కుల సంఖ్య 14,753, బౌద్ధుల సంఖ్య 1,11,201, జైనుల సంఖ్య 12,523 మంది ఉన్నారు.

ఈ గణన ఎందుకు జరిగింది?
రాష్ట్రంలోని కులాల సంఖ్యతో పాటు వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి బీహార్ ప్రభుత్వం కుల గణనను నిర్వహించింది. రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనలను రూపొందించడానికి, వివిధ పథకాలను సక్రమంగా అమలు చేయడానికి ఇది దోహదపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.