Omar Abdullah: కేజ్రీవాల్ అప్పుడు మాకు మద్దతు తెలపలేదు.. ఇప్పుడు మాత్రం మా మద్దతు మీకు కావాలా?
జమ్మూకశ్మీర్ ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నారు? అని ఒమర్ అబ్దుల్లా అన్నారు.

Omar Abdullah
Omar Abdullah – Arvind Kejriwal: కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ(Delhi)లో పాలనా అధికారాలపై తీసుకొచ్చిన ఆర్డినెన్సు(Centres Ordinance)కి వ్యతిరేకంగా మద్దతు ఇవ్వాలని దేశంలోని విపక్ష నేతలను సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరుతున్నారు. దీనిపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ విమర్శలు గుప్పించారు.
” జమ్మూకశ్మీర్ ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నారు? ఆ సమయంలో ప్రభుత్వానికి కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. ఇప్పుడేమో ఆయన ఇతర పార్టీల మద్దతు కోరుతున్నారు ” అని ఒమర్ అబ్దుల్లా అన్నారు.
కేజ్రీవాల్ ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR), తమిళనాడు (Tamil Nadu) సీఎం స్టాలిన్ (MK Stalin)ను, ఇతర కీలక నేతలను వేర్వేరుగా కలిశారు. కేజ్రీవాల్ వెంట పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఇతర నేతలు కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కేంద్ర సర్కారు ఢిల్లీలో పాలనా అధికారాలపై ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని అన్నారు. దీనికి వ్యతిరేకంగా పార్లమెంటులో మద్దతు ఇవ్వాలని కోరారు.
దేశంలోని బీజేపీయేతర పార్టీలన్నీ ఢిల్లీ ఆర్డినెన్సుపై ఒక్కటై రాజ్యసభలో దీన్ని ఓడిస్తే, 2024 ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి రాదన్న సందేశం వెళ్తుందని కేజ్రీవాల్ ఇటీవల యూపీలో అన్నారు.