Omicron Subvariants : భారత్‌లో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతున్న సబ్ వేరియంట్ కేసులు.. ఫోర్త్ వేవ్ తప్పదా?
భారత్ లోనూ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసులు కనిపించాయి. దేశంలో XBB, వేరియంట్ కేసులు 70కి పైగా నమోదయ్యాయి.

Omicron Subvariants : ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనాపై చర్చ మొదలైంది. దీనికి కారణం సింగపూర్ తో పాటు మరికొన్ని దేశాల్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు వ్యాపిస్తుండటమే. భారత్ లోనూ మహారాష్ట్ర, ఒడిశా, వెస్ట్ బెంగాల్, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో సబ్ వేరియంట్ కేసులు కనిపించాయి. దేశంలో XBB, వేరియంట్ కేసులు 70కి పైగా నమోదయ్యాయి.
ఒమిక్రాన్ మరో సబ్ వేరియంట్ BQ.1 కేసులూ నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2వేల 141 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ వంటి ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. గత వారంతో పోలిస్తే ఈ వారం మహారాష్ట్రలో కేసుల సంఖ్య భారీగా పెరిగింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
వీటికి తోడు WHO చేసిన తాజా హెచ్చరిక కలవర పెడుతోంది. కరోనా మహమ్మారి కాలం ముగిసిపోలేదని, ఇప్పటికీ ఇది అంతర్జాతీయంగా ప్రమాదకర వైరస్ లానే ఉందని ప్రకటించింది. అయితే కొవిడ్ వేరియంట్లను గుర్తించడం, వైద్య సదుపాయాలు పెంచుకోవడం, వ్యాక్సినేషన్ ద్వారా వైరస్ ను నియంత్రించవచ్చని WHO తెలిపింది.
ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో కరోనా అంతరించిపోయినట్లుగా కనిపిస్తోందని, కానీ ఇప్పటికీ ప్రజల ఆరోగ్యంపై వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని WHO హెచ్చరించింది. మరోవైపు ఒమిక్రాన్ సబ్ వేరియంట్లతో ఫోర్త్ వేవ్ వ్యాపిస్తోందన్న ప్రచారమూ జరుగుతోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ తో అలర్ట్ గా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అయితే వైరస్ ను తట్టుకునే రోగినిరోధక శక్తి పెరగడం, వ్యాక్సిన్ వేయించుకున్న వారి సంఖ్య భారీగానే ఉండటంతో ఆందోళన పడాల్సిన అవసరం లేదంటున్నారు. వేరియంట్ల బారిన పడినప్పటికీ, ఆసుపత్రిలో చేరి చికిత్స పొందే అవసరం తక్కువగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, వ్యాధులతో బాధపడేవారు బయటకు వెళ్లడం తగ్గించాలని, సమూహాల్లోకి వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు.