చిదంబరం కస్టడీ మరోసారి పొడిగింపు

  • Published By: venkaiahnaidu ,Published On : August 30, 2019 / 01:42 PM IST
చిదంబరం కస్టడీ మరోసారి పొడిగింపు

Updated On : August 30, 2019 / 1:42 PM IST

INX మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరం కస్టడీని సీబీఐ ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఇప్పటికే ఆయన్ను కస్టడీలో ఉంచి విచారిస్తున్న విషయంతెలిసిందే. కస్టడీ ముగియడంతో ఇవాళ(ఆగస్టు-30,2019) ఆయనను కోర్టులో హాజరుపరిచారు. చిదంబరం బయటకు వెళ్తే తప్పించుకునే ప్రమాదం ఉండటంతో ఆయనను మరికొన్ని రోజులు కస్టడీలోనే ఉంచాలని సీబీఐ న్యాయస్థానాన్ని కోరిడంతో ఇందుకు కోర్టు అంగీకరించింది. చిదంబరం కస్టడీని సెప్టెంబర్‌ 2 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  

ఈ  కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను  ఢిల్లీ హైకోర్టు గతవారం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్‌పై తక్షణ విచారణ జరిపేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో ఆగస్టు 22న చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

అయితే ఇదే కేసులో ఈడీ అరెస్ట్ నుంచి చిదంబరానికి స్వల్ప ఊరట లభించింది.  ఈడీ తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర బెయిల్ కోరుతూ  చిదంబరం వేసిన పిటిషన్‌పై సెప్టెంబరు 5న తీర్పు వెల్లడించనున్నట్లు గురువారం సుప్రీం తెలిపింది. అప్పటివరకు ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేయకుండా కోర్టు తాత్కాలిక రక్షణ కల్పించింది.