Pahalgam Terror Attack: పాక్ కుట్రలు.. పహల్గాం ఘటనకు సంబంధం లేదంటూనే సరిహద్దుల్లో కాల్పులు.. అంతర్జాతీయ దర్యాప్తు అంటూ కొత్తరాగం..
పహల్గాంలో ఉగ్రదాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తు అవసరమని ..

Pahalgam Terror Attack
Pahalgam Terror Attack: జమ్మూకశ్మీర్ ప్రాంతం పహల్గాంలో జరిగిన ఘోరమైన ఉగ్రవాదదాడిలో 26మంది పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని భారత్ ఆరోపిస్తుంది. పాకిస్థాన్ కు గుణపాఠం చెప్పేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా భారత్ దౌత్య సంబంధాలను తగ్గించింది. కీలకమైన సింధూ జల ఒప్పందాన్ని నిలిపివేసింది. పాకిస్తాన్ వీసాలను రద్దు చేసింది. భారత్ లోని పాకిస్థానీయులు వారంరోజుల్లో భారత్ విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.
Also Read: Vijayawada : విజయవాడలో ఉగ్రవాదులు..? 10మంది అనుమానితుల గుర్తింపు..
భారత్ ఆరోపిస్తున్నట్లు పహల్గాం ఉగ్రదాడికి పాకిస్థాన్ కు ఎలాంటి సంబంధం లేదని ఆ దేశ పాలకులు చెబుతున్నారు. అదే సమయంలో పాక్ సైనికులు సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్నారు. గురువారం అర్థరాత్రి సమయంలో పాకిస్థాన్ ఎల్ఓసీ వద్ద కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి కూడా నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. దీన్ని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టినట్లు రక్షణ శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు.
పహల్గాంలో ఉగ్రదాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తు అవసరమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహహ్మద్ ఆసిఫ్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. పహల్గాం ఘటన తరువాత జరిగిన పరిణామాలను భారతదేశం జలాల భాగస్వామ్య ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని, దేశీయ రాజకీయ ప్రయోజనాలకోసం ఒక సాకుగా ఉపయోగిస్తోందని ఆసిఫ్ ఆరోపించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి దర్యాప్తు లేకుండా పాకిస్థాన్ పై ప్రతీకార చర్యలుకు భారత్ పాల్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
అయితే, పాకిస్థాన్ ఉగ్రవాదులకు నిలయంగా మారిందని గతంలో పలుసార్లు రుజువైంది. పాకిస్థాన్ రక్షణ మంత్రి కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ, వారికి వసతి కల్పించడం వంటివి గత ముప్పై ఏళ్లుగా పాకిస్థాన్ చేస్తుందని చెప్పుకొచ్చాడు. అయినా ఉగ్రవాదులతో తమకు ఎలాంటి సంబంధం లేదని, భారత్ లో పహల్గాం దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించే ప్రయత్నం పాకిస్థాన్ చేస్తూనే ఉంది.
మరోవైపు.. పహల్గాం ఉగ్రదాడికి మూడు రోజుల ముందు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కాశ్మీర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్‌ను తాము మరిచిపోలేమని అన్నారు. అది తమ ప్రధాన రక్తనాళమని ఆయన చెప్పాడు. ఈ వ్యాఖ్యలతోనే రెచ్చి పోయి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉద్రవాద సంస్థ కశ్మీర్ లో అటాక్ చేసిందని ఇండియన్ ఆర్మీ సీనియర్ ఆఫీసర్లు భావిస్తున్నారు. అంతేకాదు 2018 నుంచి భారత్‌పై జరిగిన టెర్రర్ అటాక్‌ల కుట్రల వెనుక అసిమ్ మునీర్ ఉన్నారని కొన్ని సందర్భాలని పరిశీలిస్తే అర్థమవుతుంది.