యుద్ధం తప్పదు : భారత్ లోని పాక్ హైకమీషనర్ కు ఇస్లామాబాద్ పిలుపు

భారత్ లోని పాక్ హై కమీషనర్ ని అత్యవసరంగా పాక్ రావాలని ఆ దేశం ఆదేశించింది. పుల్వామా ఉగ్రదాడితో పాక్ పై భారత్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. సరిహద్దుల్లో కూడా యుద్ద వాతావరణం నెలకొంది. ఈ సమయంలో సంప్రదింపుల కోసమంటూ ఢిల్లీలోని పాక్ హై కమీషనర్ ని ఇస్లామాబాద్ కి రావాలని పాక్ ఆదేశించింది.
సోమవారం(ఫిబ్రవరి-18,2019) ఉదయం ఢిల్లీలోని పాక్ హై కమీషనర్ సోహైల్ మొహమద్ పాక్ కు బయల్దేరి వెళ్లినట్లు పాకిస్తాన్ ఫారిన్ ఆఫీస్ ప్రతినిధి మొహమద్ ఫైసల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి ఇప్పటికే పాక్ హై కమీషనర్ కు భారత్ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అదే రోజు పాక్ లోని భారత హై కమీషనర్ అజయ్ బిసరియాను భారత్ రావాలని ప్రభుత్వం ఆదేశించింది.
పాక్ వెంటనే జైషే మహమద్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, టెర్రరిస్టు గ్రూపులకు, వారితో సంబంధాలు పెట్టుకొని ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిని వెంటనే చర్యలు తీసుకోవాల్సిందేనని భారత్ పాక్ ను తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం.ఇప్పటికే పాక్ కు ఎమ్ఎఫ్ఎన్ స్టేటస్ ఉపసంహరించుకొన్న భారత్ పాక్ ని ప్రపంచంలో ఒంటరి చేసేందుకు అన్ని అవసరమైన ప్రయత్నాలు చేస్తోంది.