గిల్గిట్-బాల్టిస్థాన్ కు రాష్ట్ర హోదా ఇస్తాం…పాకిస్తాన్

కశ్మీర్ అంశంలో ఎన్నిసార్లు భంగపాటు ఎదురైనా.. వక్రబుద్ధిని మార్చుకోని పాకిస్తాన్ ఇప్పుడు… పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతానికి పూర్థిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలోనే ప్రధాని ఇమ్రాన్ ఖాన్… గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతంలో పర్యటించి దీనిపై అధికారిక ప్రకటన చేస్తారని గిల్గిట్-బాల్టిస్థాన్ వ్యవహారాల శాఖ మంత్రి అలీ అమిన్ గండాపుర్ తెలిపారు.
అన్ని రకాల రాజ్యాంగ హక్కులతో పూర్తిస్థాయి రాష్ట్రహోదాపై అధికారిక ప్రకటన చేయనున్నారని అమిన్ గండాపుర్ తెలిపారు. జాతీయ అసెంబ్లీ, సెనేట్ సహా అన్ని రాజ్యాంగ సంస్థల్లో గిల్గిట్-బాల్టిస్థాన్కు తగిన ప్రాతినిధ్యం ఇస్తామన్నారు. చైనా, పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) కింద మోక్ పాండస్ ప్రత్యేక ఆర్థిక జోన్ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.
పాక్ కు ఎలాంటి హక్కులు లేవన్న భారత్
కాగా, గిల్గిట్-బాల్టిస్థాన్తో పాటు మొత్తం జమ్ముకశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు తమ దేశంలో అంతర్భాగమేనని ఇప్పటికే పాక్కు స్పష్టం చేసింది భారత్. అక్రమంగా, బలవంతంగా ఆక్రమించుకున్న భూభాగంపై పాక్ కు ఎలాంటి హక్కులు లేవని తేల్చిచెప్పింది. ఆక్రమించుకున్న అన్ని భూభాగాలను ఖాళీ చేయాలని గత మే నెలలోనే సూచించింది. ఇప్పటికే.. సీపెక్ కారిడార్ పీఓకే నుంచి వెళ్తుండడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.