ఉగ్రవాదులను చంపితే విపక్షాలకు సంతోషం లేదు.. పాకిస్థాన్‌ను కాపాడితే కాంగ్రెస్‌కు ఏం వస్తుంది..? : లోక్‌సభలో అమిత్ షా ఫైర్
లోక్‌సభలో రెండోరోజు ఆపరేషన్ సిందూర్ పై ప్రత్యేక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ విపక్షాలపై ఫైర్ అయ్యారు.

Amit Shah
operation sindoor: లోక్‌సభలో రెండోరోజు ఆపరేషన్ సిందూర్ పై ప్రత్యేక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ విపక్షాలపై ఫైర్ అయ్యారు. మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం మాట్లాడుతూ.. ఈ ఉగ్రవాదులు పాకిస్థాన్ నుండి వచ్చారనడానికి రుజువు ఏమిటి అని ప్రశ్నించడం నాకు చాలా బాధగా అనిపించింది. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు..? ఎవరిని కాపాడాలనుకుంటున్నారు..? పాకిస్థాన్ కు మద్దతుగా మాట్లాడుతున్నారా..? పాకిస్థాన్‌ను కాపాడటం ద్వారా మీరు (కాంగ్రెస్) ఏం పొందాతారు..? అంటూ అమిత్ షా ఫైర్ అయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం తగదని అన్నారు.
జమ్మూకశ్మీర్ లో సోమవారం జరిగిన ఆపరేషన్ మహాదేవ్‌లో పహల్గాం దాడితో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను సైనిక దళాలు మట్టుపెట్టాయి. ఆ అంశంపై పార్లమెంట్ లో అమిత్ షా మాట్లాడుతూ.. ఆపరేషన్ మహదేవ్ ద్వారా పహల్గాం అనుమాష ఘటనకు సంబంధించి ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని ప్రకటించారు. కీలక నిందితుడు సులేమాన్ ను హతమార్చామని, అలాగే వారు పాకిస్థాన్ నుంచే వచ్చారనేందుకు తమ ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు.
ఉగ్రవాదులు చనిపోయారన్న సంతోషం కూడా విపక్షాలకు లేదు. ఉగ్రవాదులను అంతమొందించామని చెప్పగానే విపక్షాలు ఆనందం వ్యక్తం చేస్తాయనుకున్నా.. కానీ, విపక్షాలు సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. హతమైన ముగ్గురు ఉగ్రవాదులు పాక్‌కు చెందినవారేనని ఆధారాలున్నాయి. ఉగ్రవాదుల నుంచి పాకిస్థాన్ కు సంబంధించిన పత్రాలు, పాక్ చాకెట్లు స్వాధీనం చేసుకున్నామని అమిత్ షా స్పష్టం చేశారు.
ఏప్రిల్ 30న సీసీఎస్ సమావేశం జరిగింది, దీనిలో భద్రతా దళాలకు పూర్తి కార్యాచరణ, స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ మే 7న ప్రారంభమైంది. తెల్లవారుజామున 1:04 నుండి 1:24 గంటల మధ్య జరిగింది. ఈ ఆపరేషన్‌లో, పాకిస్తాన్‌కు చెందిన తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో ఏ పాకిస్తానీ పౌరుడు కూడా మరణించలేదని అమిత్ షా చెప్పారు.
ఉగ్రవాదులతో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ ప్రపంచానికి చెబుతోంది. కానీ, ఆపరేషన్ సిందూర్ రెండవ రోజు పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల అంత్యక్రియల ఊరేగింపు జరిగింది. పాకిస్తాన్ సైన్యం, పోలీసు అధికారులు అందులో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్‌ను బయటపెట్టిందని అమిత్ షా అన్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ డీజీఎంఓ మాకు ఫోన్ చేశారు. ఆ తరువాత మేము యుద్ధాన్ని ఆపామని పార్లమెంట్ లో అమిత్ షా స్పష్టం చేశారు.