24 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. కీలక అంశాలు ఇవే..

టీడీపీ, జేడీయూ స్పీకర్ పోస్టును ఆశిస్తున్నాయి. అయితే డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తోంది.

24 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. కీలక అంశాలు ఇవే..

Parliament Special Session : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 3వ తేదీ వరకు ఈ ప్రత్యేక సమావేశాలు కొనసాగుతాయి. జూన్ 24, 25 తేదీల్లో ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. జూన్ 26న స్పీకర్ ఎన్నిక ఉండే అవకాశం ఉంది. 18వ లోక్ సభకు సంబంధించిన తొలి పార్లమెంట్ సమావేశాల తేదీలు ఖరారైనట్లుగా తెలుస్తోంది. జూన్ 24 నుంచి జూలై 3వ తేదీ వరకు 8 రోజుల పాటు ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి.

543 లోక్ సభ స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలిచిన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగాల్సి ఉంది. ఎంపీలంతా కూడా పార్లమెంట్ లోనే ప్రమాణ స్వీకారం చేస్తారు. 24, 25 తేదీల్లో ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. 26వ తేదీన లోక్ సభ స్పీకర్ ఎంపిక ఉంటుంది. ఎవరికి సంఖ్యా బలం ఉంటే.. వారి ప్రభుత్వం తరుపునే స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ప్రస్తుతం ఎన్డీయేలో బీజేపీకి పూర్తి స్తాయి మెజారిటీ సంఖ్యా బలం రాలేదు. దాంతో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. టీడీపీ, జేడీయూ స్పీకర్ పోస్టును ఆశిస్తున్నాయి. అయితే డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటివరకు ఓం బిర్లా.. స్పీకర్ గా కొనసాగారు. ఆయననే మళ్లీ కొనసాగించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గంలో పని చేసిన పాతవారికే మళ్లీ అవే మంత్రిత్వ శాఖలు కేటాయించి ఏ విధంగా బీజేపీ వ్యవహరించిందో.. ఇప్పుడు అదే తరహాలో స్పీకర్ పదవికి సంబంధించి ఓం బిర్లానే పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మోస్ట్ సీనియర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ను స్పీకర్ గా ఎన్నిక చేసే సంప్రదాయం కూడా ఉంది. అయితే, ఏపీ నుంచి పురంధేశ్వరి పేరు స్పీకర్ పదవి రేసులో వినిపిస్తోంది. పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని అంతా ఆశించారు. కానీ, అనూహ్యంగా శ్రీనివాస వర్మకు ఏపీ బీజేపీ నుంచి పదవి ఇవ్వడం జరిగింది. దీంతో స్పీకర్ పదవి రేసులో పురంధేశ్వరి పేరు వినిపిస్తోంది.

స్పీకర్ ఎన్నిక తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. స్పెషల్ సెషన్ లో ఎంపీల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సెకండ్ సెషన్ లో వర్షాకాల సమావేశాల్లో బడ్జెట్ పై చర్చ, అలాగే ఆమోదానికి సంబంధించి సభ ప్రొసీడింగ్స్ జరిగే ఛాన్స్ ఉంది.

Also Read : ప్రధాని మోదీ 3.0 ఎలా ఉండబోతుంది? లక్ష్య సాధనకు చేయాల్సింది ఏంటి?