Pegasus: మళ్లీ పెగాసస్ ప్రకంపనలు.. ఎన్నికల వేళ ‘యుద్ధం’ పేరుతో న్యూయార్క్ టైమ్స్ కథనం

బడ్జెట్ సెషన్‌కు ముందు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేడిలో, పెగాసస్ వ్యవహారంపై దూమారం రేగుతోంది.

Pegasus: మళ్లీ పెగాసస్ ప్రకంపనలు.. ఎన్నికల వేళ ‘యుద్ధం’ పేరుతో న్యూయార్క్ టైమ్స్ కథనం

Pegasus

Pegasus Latest Update: బడ్జెట్ సెషన్‌కు ముందు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేడిలో, పెగాసస్ వ్యవహారంపై దూమారం రేగుతోంది. ఇజ్రాయెల్‌ సంస్థ NSO తయారుచేసిన పెగాసస్‌ స్పైవేర్‌తో రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖుల ఫోన్లను హ్యాక్‌ చేశారనే ఆరోపణలను అప్పట్లో మోదీ సర్కారు ఖండించగా.. సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో నిపుణుల కమిటీ వేసింది. మోదీ ప్రభుత్వం 2017లోనే పెగాసస్‌ స్పైవేర్‌ను ఇజ్రాయెల్‌ నుంచి కొనుగోలు చేసినట్టు న్యూయార్క్‌ టైమ్స్‌ లేటెస్ట్‌గా మరో కథనం ప్రచురించింది.

అమెరికాకు చెందిన వార్తాపత్రిక న్యూయార్క్ టైమ్స్.. ‘ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైబర్‌ ఆయుధం కోసం జరుగుతున్న యుద్ధం’ అనే శిర్షికతో రాసిన కథనంతో ఇప్పుడు భారత రాజకీయాలు వేడెక్కుతాయని భావిస్తున్నారు. ఢిల్లీ నుంచి లక్నో వరకు ఈ సమస్య ప్రతిధ్వనించగా.. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడుతోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.

2017 జూలైలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లగా.. ఓ ఇండియన్ ప్రధాని ఇజ్రాయెల్‌లో పర్యటించడం అదే తొలిసారి. ఆ పర్యటనలో అప్పటి ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూతో అధునాతన ఆయుధాలు, క్షిపణులు, నిఘా సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన కీలక ఒప్పందాలు జరిగాయి ఈ ఒప్పందాల విలువ రెండొందల కోట్ల డాలర్లు. అయితే, ఈ ఒప్పందంలోనే పెగాసస్‌ స్పైవేర్‌ కొనుగోలు జరిగినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం చెబుతోంది.

మోదీ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడింది: రాహుల్ గాంధీ
న్యూయార్క్ టైమ్స్‌లో ప్రచురితమైన వార్త తర్వాత ప్రతిపక్షాలకు అధికార పార్టీపై దాడి చేసే అవకాశం వచ్చింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ, “మన ప్రజాస్వామ్యం, రాజకీయ నాయకులు ప్రజలపై గూఢచర్యం చేయడానికి మోదీ ప్రభుత్వం పెగాసస్‌ను కొనుగోలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికార పక్షం, ప్రతిపక్షం, సైన్యం, న్యాయవ్యవస్థలను టార్గెట్ చేసింది. ఇది దేశద్రోహం. మోదీ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడింది. ఒక్క ఢిల్లీలోనే కాదు, యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ వరకు బీజేపీ ప్రత్యర్థులకు ఈ సమస్య వచ్చింది. అని అన్నారు రాహుల్ గాంధీ.

2019లో తొలిసారిగా తెరపైకి..
2019లో వాట్సాప్ ద్వారా పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. 100 మంది ప్రముఖ వ్యక్తుల గూఢచర్యం గురించి చర్చ జరిగింది, ఆ తర్వాత పెగాసస్ గూఢచర్యంపై పార్లమెంటులో చాలా దుమారం చెలరేగింది. పెగాసస్ కేసు జూలై 2021లో మళ్లీ తెరపైకి వచ్చింది.

‘ది వైర్‌’ పెగాసస్‌ స్కామ్‌ని తొలిసారి వెలుగులోకి తీసుకుని వచ్చింది. రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులపైకి కొన్ని దేశాలు పెగాస్‌సను ప్రయోగిస్తున్నాయంటూ ఫార్‌బిడెన్‌ స్టోరీస్‌ అనే కన్సార్షియం ఆఫ్‌ న్యూస్‌ ఆర్గనైజేషన్స్‌ గ్రూప్.. పెగాసస్‌పై వరుస కథనాలు ప్రచురించింది. వీటి ఆధారంగా ‘ది వైర్‌’ భారత్‌లో కూడా ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది.

ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ సహా 300 మంది రాజకీయ నాయకులు, పాత్రికేయులు, మానవ హక్కుల కార్యకర్తలు, మాజీ న్యాయమూర్తులపై ఈ స్పైవేర్‌ను కేంద్రం వినియోగించినట్టు పేర్కొంది. ఈ అంశంపై ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింపజేశాయి.

పెగాసస్ అంటే ఏమిటి?
పెగాసస్ ఒక నిఘా స్పైవేర్. దీనిని ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ NSO తయారు చేసింది. అధీకృత ప్రభుత్వ ఏజెన్సీలకు మాత్రమే ఈ స్పైవేర్ విక్రయించినట్లు ఇజ్రాయిల్ చెబుతోంది. ఇది స్మార్ట్‌ఫోన్‌లో ఉంచినట్లయితే, హ్యాకర్ మైక్రోఫోన్, కెమెరా, ఆడియో సహా మెసేజ్‌లు, ఈ మెయిళ్ల సమాచారం పొందవచ్చు.

పెగాసస్ లైసెన్స్ ఖరీదు సంవత్సరానికి రూ. 60 కోట్ల వరకు ఉంటుంది. 2016 డేటా ప్రకారం, 10 మందిని పర్యవేక్షించడానికి రూ.9 కోట్లు ఖర్చు అవుతుంది. పెగాసస్ లైసెన్స్ సంవత్సరానికి 500 మందిని పర్యవేక్షించగలదు. దాదాపు 50 మందిని ఒకేసారి పర్యవేక్షించే అవకాశం ఇందులో ఉంటుంది.