IIT Guwahati student: రేపిస్ట్ కూడా దేశ భవిష్యత్ ఆస్తేనా? మరి నేనూ?

అత్యాచారానికి సంబంధించిన కేసులో ఆగస్టు 13న గువహటి హైకోర్టు న్యాయమూర్తి అజిత్ బోర్తాకూర్ నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు.

IIT Guwahati student: రేపిస్ట్ కూడా దేశ భవిష్యత్ ఆస్తేనా? మరి నేనూ?

Court

Updated On : August 28, 2021 / 9:04 AM IST

IIT Guwahati student: అత్యాచారానికి సంబంధించిన కేసులో ఆగస్టు 13న గువహటి హైకోర్టు న్యాయమూర్తి అజిత్ బోర్తాకూర్ నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ మంజూరు చేస్తున్నప్పుడు నిందితుడు ఐఐటీఎన్ కావడం వల్ల “దేశ భవిష్యత్ ఆస్తులు” మరియు “ప్రతిభావంతులైన విద్యార్థులు” అని పేర్కొనడం గమనార్హం.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటి) గువహటి విధ్యార్థి ఉత్సవ్‌ కదమ్‌ (21), ఈ ఏడాది మార్చిలో తోటి విద్యార్థిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెలలో గువహటి విద్యార్ధి హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. నిందితుడి పాస్‌పోర్ట్ జప్తు చేయాలంటూ ఇప్పుడు మరో కేసు నమోదైంది.

ఈ కేసును విచారిస్తున్న కమ్రూప్ రూరల్ జిల్లాలోని అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టులో అత్యాచార బాధిత మహిళ ఈ పిటీషన్ వేసింది. కోర్టు దరఖాస్తును స్వీకరించగా.. సెప్టెంబర్ 1న ఛార్జీల విచారణ చేపడుతుంది. బెయిల్ మంజూరు చేసే సమయంలో నిందితుడు మరియు బాధితురాలు ఇద్దరూ “దేశ భవిష్యత్ ఆస్తులు” మరియు “ప్రతిభావంతులైన విద్యార్థులు” అని న్యాయమూర్తి అన్నారు. నిందితులు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం లేదన్నారు.

అయితే, కోర్టు వ్యాఖ్యలపై విద్యార్థిని ఘాటుగానే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘ఐఐటీయన్‌ అనే కారణాన్ని చూపించి నిందితుడికి కోర్టు బెయిల్‌ ఇచ్చింది. ఒకవేళ ఆ లెక్కన కోర్టు నిర్ణయాలను తీసుకుంటే.. నేను కూడా ఐఐటీయన్‌నే కదా ? ఉత్సవ్‌ స్నేహితులు ఇప్పుడు వాట్సాప్‌ గ్రూపులు, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు వేదికగా నా పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారు’’ అంటూ అసహనం వ్యక్తం చేసింది.

ఈ కేసులో ఛార్జ్ షీట్ ప్రకారం, మార్చి 28 న బలవంతంగా మద్యం ఇచ్చిన తర్వాత బాధితురాలు స్పృహ కోల్పోయింది. తర్వాత నిందితుడు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.