ప్రధాని బెంగాల్ పర్యటన రద్దు
ప్రధాని మోడీ శుక్రవారం బెంగాల్ పర్యటనను రద్దు చేసుకున్నారు.

Pm Modi
PM Modi ప్రధాని మోడీ శుక్రవారం బెంగాల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఏడో దశ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోని నాలుగు ప్రచార సభల్లో మోడీ పాల్గొనాల్సి ఉండగా..బెంగాల్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు గురువారం మోడీ ట్వీట్ చేశారు. దేశంలో కరోనా పరిస్థితులపై రేపు హైలెవల్ మీటింగ్ లు నిర్వహిస్తున్న కారణంగా తాను శుక్రవారం బెంగాల్ పర్యటనకు వెళ్లడం లేదని ప్రధాని మోడీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
కాగా, ప్రధాని మోడీ బెంగాల్ ఎన్నికల పర్యటనను రద్దు చేసుకోవడం ఇదే ప్రథమం. మరోవైపు,కేంద్రహోంమంత్రి అమిత్ షా కూడా ఇవాళ తన బెంగాల్ ప్రచారాన్ని కుదించారు. ఇవాళ మూడు మీటింగ్ లలో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ..రెండు మీటింగ్ లను రద్దు చేసుకొని కోవిడ్ మీటింగ్ కోసం ఢిల్లీ తిరిగెళ్లిపోయారు అమిత్ షా.
బెంగాల్ లో ఇవాళ ఆరో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మరో రెండు దశలకు జరగాల్సి ఉంది.ఈ నెల 26న ఏడోదశ పోలింగ్, ఈ నెల 29న ఎనిమిదో దశ పోలింగ్ జరుగుతాయి. అయితే, కరోనా నేపథ్యంలో బెంగాల్ పోల్ షెడ్యూల్ ను కుదించి ఒకే ఫేజ్ లో మిగతా ఎన్నికలన్నీ జరపాలన్న టీఎంసీ అభ్యర్థను ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ బెంగాల్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, ఫేజుల కుదింపు సవాలే ఉండదని, కొవిడ్ నేపథ్యంలో అదనపు జాగ్రత్తలు తీసుకునైనా పోలింగ్ నిర్వహించే తీరుతామని ఈసీ కుండబద్దలుకొట్టింది. బెంగాల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 2న జరుగుతుంది.