PM Modi: ప్రధాని పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం.. 20 నిమిషాలు ఫ్లై ఓవర్ పైనే

ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో అంతరాయం ఏర్పడింది. హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారకానికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ప్రధానమంత్రి కాన్వాయ్ ఫ్లైఓవర్ వద్దకు....

PM Modi: ప్రధాని పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం.. 20 నిమిషాలు ఫ్లై ఓవర్ పైనే

Pm Modi

Updated On : January 5, 2022 / 5:22 PM IST

PM Modi: రెండేళ్ల తర్వాత పంజాబ్ లో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి నిరసన సెగ తగిలింది. ఫిరోజీ పూర్ జిల్లాలో రోడ్డుపై వెళ్తున్న ప్రధాని కాన్వాయ్ ని నిరసన కారులు అడ్డుకున్నారు. దీంతో.. హుస్సేనీవాలా ఏరియాకు దగ్గర్లో ఉన్న ఓ ఫ్లైఓవర్ పైనే ప్రధాని మోదీ కాన్వాయ్ దాదాపు 20 నిమిషాల పాటు ఆగిపోయిన పరిస్థితి. ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో.. పర్యటనను రద్దు చేసుకున్న మోదీ తిరుగు ప్రయాణం అయ్యారు. రూ.42,750 కోట్ల విలువైన ప్రాజెక్టులను పంజాబ్ లో మోదీ ప్రారంభించకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. భద్రతా లోపం, సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైనట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది.

రెండేళ్ల తర్వాత బుధవారం(జనవరి 5, 2022) పంజాబ్ పర్యటనకు వెళ్లారు మోదీ. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బటిండా ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న మోదీ.. హెలికాప్టర్ లో హుస్సేనీ వాలా ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. ఐతే.. వాతావరణం ప్రతికూలంగా ఉండటం, వర్షం పడుతుండటంతో.. రోడ్డు మార్గంలో హుస్సేనివాలాకు బయల్దేరారు మోదీ. హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారకం దగ్గర నివాళులర్పించి.. ఫిరోజీపూర్ లో బహిరంగ సభకు వెళ్లాలని మోదీ  భావించారు. ఐతే.. స్మారకానికి 30 కి.మీ. దూరంలోనే ప్రధాని కాన్వాయ్ కు నిరసన సెగ తగిలింది. ఓ ఫ్లైఓవర్ ను కాన్వాయ్ సమీపించగానే రహదారిని అడ్డుకున్నారు నిరసనకారులు. దీంతో.. 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పై కాన్వాయ్ లోనే ఉండిపోయారు మోదీ.

ఊహించని పరిణామాలు, భద్రతా లోపాల కారణంగా.. పంజాబ్ పర్యటనకు రద్దు చేసుకున్నారు ప్రధాని మోదీ. అక్కడి నుంచి నేరుగా భటిండా ఎయిర్ పోర్ట్ కు వెళ్లిపోయారు. షెడ్యూల్ ప్రకారం ఫిరోజిపూర్ లో సాయంత్రం జరగాల్సిన ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొనాల్సి ఉంది. ఐతే.. ఫిరోజిపూర్ ర్యాలీలో మోదీ పాల్గొనడం లేదని స్టేజీ పైనుంచే ప్రకటించారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ.

ప్రధానమంత్రి షెడ్యూల్, రూట్ మ్యాప్ ను కేంద్రం ముందుగానే పంజాబ్ ప్రభుత్వానికి తెలియజేసింది. ప్రధాని పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను చేశామని పంజాబ్ డీజీపీ నుంచి కన్‌ఫర్మేషన్ వచ్చిన తర్వాత.. మోదీ పర్యటనకు బయల్దేరారు. రోడ్డుపై నిరసన కారుల ఆందోళన కారణంగా.. ప్రధాని పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

ప్రధాని భద్రతలో ఇది అతి పెద్ద లోపమని కేంద్ర హోంశాఖ తెలిపింది. లాజిస్టిక్స్ కోసం పంజాబ్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్లాన్ ను సిద్ధం చేసుకోవాల్సిందని.. మోదీ వెళ్లే రోడ్డు మార్గంలో అదనపు బలగాలతో సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిందని కేంద్ర హోంశాఖ అభిప్రాయపడింది. భద్రతా లోపాన్ని తీవ్రంగా తీసుకున్న కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరింది.

ఇది కూడా చదవండి  : భారత్ లో తొలి ఒమిక్రాన్ మరణం రాజస్తాన్ లో