PM Modi Tour : జులై 7, 8 తేదీల్లో తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
తెలంగాణలోని వరంగల్‌లో రూ. 6,100 కోట్ల విలువైన రైలు, రోడ్డు అభివృద్ది పనులకు శంఖుస్థాపనలు చేయనున్నారు. రూ. 500 కోట్లతో వ్యాగన్ తయారీ పరిశ్రమకు ప్రధాని శంఖుస్థాపన చేయనున్నారు.

PM Modi
PM Modi Visit Four States : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 7, 8 తేదీల్లో నాలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, మరికొన్ని ప్రాజక్టులకు శంఖుస్థాపనలు చేయనున్నారు. నాలుగు రాష్ట్రాల్లో సుమారు 50 వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. జులై 7న ఛత్తీస్‌ఘడ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు.
ఛత్తీస్‌ఘడ్ రాజధాని రాయపూర్‌లో రూ. 7,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడం, శంఖుస్థాపన చేయనున్నారు. వారణాసిలో రూ. 12,100 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధాని భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జులై 8న తెలంగాణ, రాజస్థాన్‌లలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. రాజస్థాన్‌లోని బికనీర్‌లో రూ. 24,300 కోట్ల ప్రాజక్టులకు ప్రధాని పనులు ప్రారంభించనున్నారు.
Union Cabinet Reshuffle: వచ్చేవారం కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.. కీలక మంత్రులకు ఉద్వాసన.. !
తెలంగాణలోని వరంగల్‌లో రూ. 6,100 కోట్ల విలువైన రైలు, రోడ్డు అభివృద్ది పనులకు శంఖుస్థాపనలు చేయనున్నారు. రూ. 5,500కోట్ల విలువైన 176 కి.మీ జాతీయ రహదారి ప్రాజక్టుకు ప్రధాని శంఖుస్థాపన చేయనున్నారు. నాగపూర్- విజయవాడ జాతీయ రహదారిలో మంచిర్యాల – వరంగల్ సెక్షన్‌లో 108 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి, కరీంనగర్ – వరంగల్ సెక్షన్‌లో 68 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులకు శంఖుస్థాపన చేయనున్నారు.
రూ. 500 కోట్లతో వ్యాగన్ తయారీ పరిశ్రమకు ప్రధాని శంఖుస్థాపన చేయనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అధునాతన యంత్రాలు, పరికరాలతో కూడిన సౌకర్యాలతో వ్యాగన్ తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. రోబోటిక్ పెయింటింగ్‌తో వ్యాగన్ల తయారీ ఉండనుంది.