C-295 Aircraft: భార‌త్‌లో తయారు కాబోతున్న సి-295 ఎయిర్‌క్రాఫ్ట్ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా?

గుజరాత్ లోని వడోదరలో సి-295 ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాప్ట్ తయారీ కేంద్రాన్ని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

C-295 Aircraft: భార‌త్‌లో తయారు కాబోతున్న సి-295 ఎయిర్‌క్రాఫ్ట్ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా?

C-295 Aircraft

Updated On : October 28, 2024 / 12:11 PM IST

TATA Aircraft Complex: గుజరాత్ లోని వడోదరలో సి-295 ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాప్ట్ తయారీ కేంద్రాన్ని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. టాటా భాగస్వామ్యంతో ఎయిర్ బస్ సంస్థ దీనిని నెలకొల్పింది. ఐరోపాకు చెందిన ఈ సంస్థ బయటి దేశాల్లో ఇటువంటి ఎయిర్ క్రాప్ట్ లను తయారు చేయడం ఇదే తొలిసారి. మొత్తం 56 విమానాలను తయారు చేసేందుకు స్పెయిన్, భారత దేశం మధ్య ఒప్పందం కుదిరింది. మొదట 16 విమానాలను స్పెయిన్ లో తయారు చేయగా.. మిగిలిన 40 విమానాలను టాటా అడ్వాన్డ్స్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌కు (టీఏఎస్ఎల్) తయారు చేస్తుంది. దేశంలోనే తొలిసారిగా మిలిటరీకి సంబంధించిన విమానాలను ఓ ప్రైవేట్ కంపెనీ తయారు చేయనుంది.

 

సీ-295 విమానంలో 73 మంది సైనికులు లేదా 48 మంది పారాట్రూపర్లు లేదా 12 స్ట్రెచర్ ఇంటెన్సివ్ కేర్ మెడెవాక్ లేదా 27 స్ట్రెచర్ మెడెవాక్ తో పాటు నలుగురు వైద్య సిబ్బంది ప్రయాణించవచ్చు. ఇది విమానం ఒకేసారి గరిష్టంగా 9250 కిలోల బరువును మోయగలదు. ఈ విమానం పొడవు 80.3 అడుగులు ఉంటుంది. దీని రెక్కలు 84.8 అడుగులు ఉంటాయి. ఎత్తు 28.5 అడుగులు. ఈ విమానం 7,650 లీటర్ల ఇంధన సామర్థ్యం కలిగి ఉంటుంది. గరిష్టంగా గంటకు 482 కిలో మీటర్ల వేగంతో ఎగురుతుంది. విమానంలో లోడ్ చేయబడిన బరువుపై వేగం ఆధారపడి ఉంటుంది. ఈ విమానం టేకాఫ్ కావాలంటే 844 మీటర్ల నుంచి 934 మీటర్ల పొడవు గల రన్ వే అవసరం. ల్యాండింగ్ కు 420 మీటర్ల రన్ వే మాత్రమే అవసరం.

 

ఇరు దేశాల మధ్య ఒప్పందంలో స్పెయిన్ లోని ఎయిర్ బస్ సంస్థ కర్మాగారం నుంచి 16 విమానాలు భారత్ కు అందుతాయి. సుదీర్ఘకాలంగా వైమానిక దళంలో సేవలందిస్తున్న ఆవ్రో-748 విమానాల స్థానంలో భారత వాయుసేన వీటిని ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత బ‌రువైన విమానాలు వెళ్లలేని ప్రాంతాల‌కుసైతం సీ-295 ఎయిర్‌క్రాఫ్ట్‌లు యుద్ధసామాగ్రిని, సైనికుల‌ను సుల‌భంగా త‌ర‌లిస్తాయి. సీ-295కు సంబంధించిన విడిభాగాల ఉత్పత్తి హైదరాబాద్ లోని ‘మెయిన్‌ కన్‌స్టిట్యూయెంట్‌ అసెంబ్లీ’లో ఇప్పటికే ప్రారంభమైంది. వీటిని వడోదర యూనిట్ కు తరలించి అక్కడే తుది కూర్పు జరుగుతుంది. భారత వైమానిక దళానికి రవాణా విమానాలు చాలా ముఖ్యమైనవి. తద్వారా సైనికులు, ఆయుధాలు, ఇంధనం, హార్డ్ వేర్ లను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వీటి ద్వారా రవాణా చేయొచ్చు.