Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?

ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఐకానిక్ చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?

Updated On : June 6, 2025 / 2:30 PM IST

Chenab bridge: ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఐకానిక్ చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తద్వారా రైల్వే బ్రిడ్జిని జాతికి అకితం చేశారు. అదేవిధంగా కట్రా నుంచి కశ్మీర్ కు వందేభారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా ఆ వంతెన అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో అనుసంధానించిన అంజీ రైల్వే వంతెన (కేబుల్‌ బ్రిడ్జి)ని కూడా మోదీ ప్రారంభించారు.

వందేభారత్ రైలు ప్రారంభంతో కాట్రా-శ్రీనగర్ మధ్య దూరం తగ్గనుంది. కేవలం మూడు గంటల్లోనే రైలు చేరుకుంటోంది. ఈ కార్యక్రమంలో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చినాబ్, అంజీ వంతెనలపై పరుగులు తీసిన వందేభారత్‌ రైలులో మోదీ ప్రయాణించారు. అనంతరం మోదీ కట్రాలో బహిరంగ ర్యాలీలో పాల్గొంటారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత ప్రధాని జమ్మూకశ్మీర్ లో పర్యటించడం ఇదే తొలిసారి.. దీంతో భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరించారు.

కట్రా నుండి శ్రీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు లోకో పైలట్ రాంపాల్ శర్మ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, భారత రైల్వే కార్మికులు ఒక పురాతన కలను నెరవేర్చుకున్నందుకు ఇది మనందరికీ గర్వకారణమైన క్షణం. ముఖ్యంగా రైలు ఇంజనీర్ల సంకల్పం, భక్తి, అంకితభావం ద్వారా ఇది సాధ్యమైంది. ఇది సాధారణమైన, సులభమైన పని కాదు. ఈ మార్గం చాలా సవాలుతో కూడుకున్నది. ఈ వందే భారత్ రైలు అన్ని ఆధునిక సేవలతో నిండి ఉంది. ఈ రైలు 12 నెలలు నడుస్తుందని అన్నారు.

 

చీనాబ్ బ్రిడ్జి ప్రత్యేకతలు..
♦ చీనాబ్ బ్రిడ్జి కశ్మీర్‌లో పర్యాటకానికి ఓ గేమ్ ఛేంజర్‌ అవుతుందని అంచనాలు ఉన్నాయి.
♦ ఈ బ్రిడ్జిని నది సాధారణ నీటిమట్టానికి 359 మీటర్ల ఎత్తులో నిర్మించారు.
♦ జమ్మూకశ్మీర్‌, రియాసి జిల్లాలోని బక్కల్, కౌరి గ్రామాలను ఈ బ్రిడ్జి అనుసంధానిస్తుంది.
♦ భూకంపాలతో పాటు వరదల వంటి వాటిని తట్టుకుని సైతం నిలబడేలా దీన్ని నిర్మించారు.
♦ పారిస్‌లో ఉన్న ఈఫిల్ టవర్ కంటే ఈ బ్రిడ్జి 35 మీటర్ల ఎత్తు ఎక్కువగా ఉంటుంది.
♦ ఈ బ్రిడ్జి నిర్మాణానికి 2.86 కోట్ల కిలోల స్టీల్‌ను వాడారు.
♦ మైనస్ 10 డిగ్రీల నుంచి 40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతల్లోనూ ఈ బ్రిడ్జిని ఉపయోగించవచ్చు.
♦ ఈ బ్రిడ్జి మొత్తం 1.31 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇందుకుగానూ కేంద్ర సర్కారు రూ.1,486 కోట్లు ఖర్చు చేసింది.
♦ ఈ వంతెన జీవితకాలం దాదాపు 120 ఏళ్లు అని ఇంజినీర్లు చెప్తున్నారు. దీనిపై గరిష్ఠంగా 100కి.మీ. వేగంతో రైలు వెళ్లే అవకాశం ఉంది.
♦ జమ్మూకశ్మీర్‌ను రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించాలన్నది వందేళ్ల క్రితం నుంచి ఉన్న కల.
♦ మన దేశాన్ని బ్రిటిషర్లు పరిపాలిస్తున్న కాలంలోనే దీనికి పునాది వేసినప్పటికి ఇప్పటివరకు ఆ కల నెరవేరలేదు.
♦ 1905లో బ్రిటిషర్లు ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను పరిశీలించగా, రైల్వే లైన్ నిర్మాణానికి నాటి మహారాజా ప్రతాప్ సింగ్ కూడా ఒప్పుకున్నారు. అయినప్పటికీ పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు.
♦ మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలాసార్లు ఈ రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. ఆ కల ఇప్పుడు నెరవేరుతోంది.
♦ ఈ బ్రిడ్జి ద్వారా రైల్వే నెట్‌వర్క్‌తో జమ్మూకశ్మీర్​ లింక్ అవుతుంది.