చట్టసభల్లో డ్రామాలు వద్దు.. మంచి చర్చలు జరగాలి : ప్రధాని నరేంద్ర మోదీ

PM Modi : చట్ట సభల్లో డ్రామాలు వద్దు.. మంచి చర్చలు జరగాలి. నినాదాలు చేస్తూ సభాకార్యక్రమాలకు అడ్డుపడొద్దు.. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా

చట్టసభల్లో డ్రామాలు వద్దు.. మంచి చర్చలు జరగాలి : ప్రధాని నరేంద్ర మోదీ

PM Modi

Updated On : December 1, 2025 / 11:18 AM IST

Parliament Winter Session : చట్ట సభల్లో డ్రామాలు వద్దు.. మంచి చర్చలు జరగాలి. నినాదాలు చేస్తూ సభాకార్యక్రమాలకు అడ్డుపడొద్దు.. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా విపక్షాలు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. సోమవారం పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణంలో మోదీ మీడియాతో మాట్లాడారు.

దేశ ప్రగతి కోసం పార్లమెంటులో మంచి చర్చలు జరగాలని ఆకాంక్షించారు. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దేశాభివృద్ధి కోసం విపక్షాలు కూడా తమతో కలిసి రావాలని మోదీ పిలుపునిచ్చారు. పరాజయాన్ని ఒప్పుకొనే మనసు విపక్షానికి లేదంటూ విమర్శించారు. సభా సమయాల్లో డ్రామాలు వద్దని, చట్టసభల్లో చర్చలు తప్పనిసరని హితవు పలికారు.

బీహార్‌ ఎన్నికలను మోదీ ప్రస్తావించారు. బీహార్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొనడం ప్రజాస్వామ్యానికి గొప్ప బలమని మోదీ అన్నారు. ఓటింగ్ లో తల్లులు, సోదరీమణుల భాగస్వామ్యం పెరగడం వల్లే కొత్త ఆశ, కొత్త విశ్వాసం ఏర్పడుతోందని అన్నారు. ఓటమి నిరాశను అధిగమించి, బలమైన అంశాలను సభలో లేవనెత్తాలని ప్రతిపక్షాలను మోదీ కోరారు. ఈ సమావేశాలు ఓటమి నిరాశకు లేదా విజయం పట్ల అహంకారానికి వేదికగా మారకూడదని నొక్కి చెప్పారు. కొత్త తరం సభ్యులు అనుభవం నుండి ప్రయోజనం పొందాలి. నాటకీయత కాదు.. ప్రదర్శన, జాతీయ విధానంపై చర్చ జరగాలని మోదీ పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. సోమవారం ఉదయం 11గంటలకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పై చర్చించాల్సిందేనని ప్రతిపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేశాయి. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో జాతీయ భద్రత, కార్మిక కోడ్ లపైనా చర్చించాలని కోరాయి. అయితే, ఈ అంశాలపై ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వలేదు. మరో వైపు అణు ఇంధన బిల్లు-2025ను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు ఉన్నత విద్య, మరో ఎనిమిది బిల్లులు సభకు రానున్నాయి. సాధారణంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు 20రోజుల పాటు జరుగుతాయి. కానీ, ఈసారి వాటిని 15రోజులకే కుదించారు.