ఢిల్లీలో పేలుడు ఆల్-ఖైదా పనే..

Police investigating the Delhi blast : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు కేసు దర్యాప్తులో అధికారులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. పేలుడుకు కారణం ఆల్-ఖైదాకు చెందిన ఉగ్రవాద సంస్థగా గుర్తించారు. పేలుడుకు వాడిన పీఈటీఎన్ మెటీరియల్ ఆల్-ఖైదా మాత్రమే ఉపయోగిస్తుంది. దీంతో ఆ పేలుడు ఉగ్రవాద సంస్థ చేసినట్టుగా గుర్తించారు NIA అధికారులు. మరోవైపు.. పేలుడు ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పేలుడుకు ముందు ఇద్దరు వ్యక్తులు క్యాబ్‌లో వచ్చి అక్కడ దిగినట్లు గుర్తించారు. వీరికి ఈ పేలుడుతో ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పేలుడులో పీఈటీఎన్ ఉపయోగించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటన వెనుక పెద్ద కుట్రే ఉందని పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సన్నాహకంగానే ఈ పేలుడు జరిపినట్లు తెలుస్తోంది. పేలుడు సంభవించిన ప్రాంతానికి కొద్ది దూరంలో కెమెరా ఫుటేజీని పరిశీలించగా.. టైమ్ స్టాంప్ 1970గా ఉండడం గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే, అందులో రికార్డయిన దృశ్యాలు మాత్రం స్పష్టంగా లేవు.
అలాగే.. మరికొంత దూరంలో సగం కాలిన గులాబి రంగు చున్నీ, ఓ ఎన్వలప్‌ను గుర్తించినట్లు జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. ఎన్వలప్‌లో ఇజ్రాయెల్ రాయబారిని ఉద్దేశిస్తూ లేఖ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భద్రతా బలగాల్ని అప్రమత్తం చేశారు. కేంద్ర హోంశాఖ దీనిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ముంబయిలోని ప్రధాన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, ముఖ్యమైన సంస్థలు, అణు, ఏరోస్పేస్ విభాగాలు, కీలక ప్రాంగణాల వద్ద భద్రతను పెంచారు.