Sabarimala : శబరిమలలో అయ్యప్ప భక్తులపై పోలీసులు లాఠీచార్జ్

Sabarimala : శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గటంలేదు. రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీతో శబరిగిరులు కిటకిటలాడుతున్నాయి. పంబ నుంచి శబరిమల వరకు అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతోంది. దీంతో అధికారులు అయ్యప్ప భక్తుల్ని మధ్యలోనే నిలిపివేశారు. రద్దీని నియంత్రించేందుకు ఇలా చేయాల్సివస్తోందని అంటున్నారు. భక్తుల్ని నియంత్రించే క్రమంలో పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేశారు. దీంతో అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు.
స్వామి దర్శనానికి వచ్చిన భక్తులతో ఐదు కంపార్ట్ మెంట్లు కిక్కిరిపోయాయి. దర్శనం కోసం గంటలతరబడి వేచి చూస్తున్నారు. శబరిమల మార్గ మధ్యలోనే భక్తుల్ని గంటల తరబడి నిలిపివేస్తున్నారు. కానీ వేలాదిగా తరలివస్తున్న భక్తులకు సరైన సౌకర్యాలు కూడా లేకపోవటంతో నానా అవస్థలు పడుతున్నారు. దీంతో ఆలయ ట్రస్ట్ బోర్డులపై భక్తులు మండిపడుతున్నారు. గంటల తరబడి నిల్చుని ఉండటంతో ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. దాదాపు 10గంటలకు పైగా భక్తులు మార్గ మధ్యలోనే నిల్చుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.