గవర్నర్ భేటీ వాయిదా : ప్రభుత్వ ఏర్పాటుపై అనుమానాలు వద్దు – శివసేన

మహారాష్ట్రలో శివసేన – ఎన్సీపీ – కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైంది. అయితే ఈ మూడు పార్టీల నేతలు శనివారం గవర్నర్‌ను కలవాల్సి ఉన్నప్పటికీ అది వాయిదా పడింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు శివసేన అధికార ప్రతినిధి సంజయ్‌రౌత్. శివసేనకు చెందిన ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు.
బీజేపీ పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేల మద్దతుతో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నేతలు దేవేంద్ర ఫడ్నవిస్, చంద్రకాంత్ పాటిల్‌లు చేసిన వ్యాఖ్యలపై శివసేన మండిపడిది. బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసంభవమని శివసేన పత్రిక సామ్నాలో ఓ కథనం ప్రచురితమైంది. వారి కాన్ఫిడెన్స్ చూస్తే ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసేందుకు స్కెచ్ వేసినట్లు కనిపిస్తోందని శివసేన ఆరోపించింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌పై శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరింది.
మహారాష్ట్ర రాజకీయాలు ఎట్టకేలకు ఆఖరికి చేరుకుంటున్నట్లే అనిపిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఒకే మాట మీదకు రావడంతో సీఎం ఏ పార్టీ వ్యక్తి అనే విషయంలో తెరదించినట్లే అయ్యింది. ఈ మేరకు ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ ఓ కీలక ప్రకటనను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈసారికి శివసేన నుంచే ముఖ్యమంత్రి ఉంటారంటూ ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి పదవిని ఐదేళ్లు శివసేనకు వదలిపెట్టి, కాంగ్రెస్, ఎన్‌సీపీ చెరో డిప్యూటీ సీఎం పదవులను తీసుకుంటారని, మంత్రివర్గంలో శివసేనకు 14, ఎన్‌సీపీకి 14, కాంగ్రెస్‌కు 12 పదవులు దక్కే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అవగా.. ఇప్పటికే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించింది కేంద్రం.
Read More : ఘోరం : ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి