బీజేపీకి మరో మిత్రపక్షం ఝలక్…50:50కి ఒప్పుకోమంటున్న జేడీయూ

  • Published By: venkaiahnaidu ,Published On : December 29, 2019 / 04:11 PM IST
బీజేపీకి మరో మిత్రపక్షం ఝలక్…50:50కి ఒప్పుకోమంటున్న జేడీయూ

Updated On : December 29, 2019 / 4:11 PM IST

బీహార్ లో బీజేపీ మిత్రపక్షం ఝలక్ ఇవ్వనుందా అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ దశాబ్దాలపాటు మిత్రపక్షాలుగా కొనసాగిన టీడీపీ,శివసేన పార్టీలు దూరమయ్యాయి. ఇప్పుడు జేడీయూ కూడా బీజేపీకి బైబై చెప్పే యోచనలో ఉన్నట్లు కన్పిస్తోంది. రాజకీయాల్లో ఏమైనా జరుగవచ్చు. లాలూ-నితీష్ కలయిక లాగా. కొంతకాలంగా బీజేపీ నిర్ణయాల పట్ల సీఎం నితీష్ కుమార్ అంత సంతృప్తిగా ఉన్నట్లు కన్పించడం లేదు. మోడీ 2.0 కేబినెట్ లో కేంద్రమంత్రి పదవుల విషయంలో బీజేపీ వైఖరి పట్ల నితీష్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్రమంత్రివర్గం నుంచి జేడీయూ తప్పుకుందంటూ బహిరంగంగానే ప్రకటించిన విషయం తెలిసిందే.

కొంతకాలంగా బీజేపీ నిర్ణయాలపై నితీష్ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎన్ఆర్సీ,సీఏఏను అమలు చేసేది లేదంటూ పరోక్షంగా బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు నితీష్. అయితే ఈ సమయంలో జేడీయూలో నెంబర్-2, ఆ పార్టీ ఉపాధ్యక్ష్యుడు ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే బీజేపీతో నితీష్ తెగదెంపులకు రెడీ అయినట్లు అర్థమవుతుంది.

ఆదివారం ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ…వచ్చే ఏడాది చివర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సింహభాగం సీట్లు జేడీయూకే దక్కాలన్నారు.  బీజేపీ తప్పనిసరిగా నితీష్ కుమార్ సీట్ షేర్ డీల్ ను పున సమీక్ష చేయాల్సిందేనన్నారు. ఇప్పటివరకు బీహార్ లో 50-50 షేరింగ్ అనుకుంటున్న బీజేపీ ఆ ఆలోచనకు స్వస్తి చెప్పి మిత్రపక్షమైన జేడీయూకే ఎక్కువ సీట్లలో పోటీచేసేందుకు అంగీకరించాలన్నారు. సీట్ల వాటా 2009,2010 అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా 1కి 1.4గా ఉండాలన్నారు.

మహారాష్ట్రలో బీజేపీకి వ్యతిరేకంగా ఇటీవల శివసేన చేసిన తిరుగుబాటు, ప్రతిపక్షాల సహాయంతో అధికారాన్ని స్వాధీనం చేసుకోవడం,జార్ఖండ్ లో బీజేపీ ఓటమి వంటి అంశాలు జేడీయూని పెద్ద వాటా అడగటం కోసం ప్రేరేపించాయని ఊహాగానాలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఉన్నట్లుగా సీట్ల వాటా 50:50 గా ఉంటుందని బీజేపీ చెబుతున్న సమయంలో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో ఏం జరగబోతుంది అని ఆశక్తిగా ఎదురుచూసేలా చేశాయి. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను కొందరు బీజేపీ నాయకులు ప్రశ్నించారు. ఏ సామర్థ్యంతో పీకే ఈ వ్యాఖ్యలు చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. రెండు పార్టీల హైకమాండ్ చేత సీట్ల భాగస్వామ్యం నిర్ణయించబడుతుందని, ప్రశాంత్ కిషోర్ ఈ ఇష్యూలో ముక్కు ఎందుకు పెడుతున్నారో తనకు అర్థం కావడం లేదని బీజేపీ నాయకుడు నితిన్ నవీన్ అన్నారు.

2015లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ,ఆర్జేడీ,ఎస్పీ,ఎన్సీపీ కలిసి మహాఘట్ బంధన్ గా ఏర్పడి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మహాఘట్ బంధన్ కు మెజార్టీ సీట్లు వచ్చి నితీష్ సారధ్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని పరాణామాలతో ఏడాదిలోపే మహాఘట్ బంధన్ కు బైబై చెప్పి సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ పాత మిత్రపక్షం బీజేపీతో చేతులు కలిపి మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.