అధికార దుర్వినియోగం…ప్రధాని కోసం గవర్నర్ ప్రచారం

సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోసం ప్రచారం నిర్వహించి రాజస్థాన్ గవర్నర్ చిక్కుల్లో పడ్డారు.తన రాజ్యాంగబద్దమైన పదవి రూల్స్ ను కళ్యాణ్ సింగ్ ఉల్లంఘించినట్లు ఎలక్షన్ కమిషన్ రాష్ట్రపతికి లేఖ రాయడంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ ప్రభుత్వానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఓ లేఖను పంపించారు.కేంద్రహోంమంత్రిత్వ శాఖకు కూడా ఈ లెటర్ ను కోవింద్ ఫార్వార్డ్ చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ దేశ రక్షణ కోసం,సొసైటీ కోసం మరోసారి మోడీ ప్రధాని కావాల్సిందేనని తన సొంతూరు అలీఘర్ లో మాట్లాడుతూ కెమెరా కంటికి చిక్కారు.మోడీ తిరిగి ప్రధాని అవడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని కళ్యాణ్ సింగ్ అన్నారు.అలీఘర్ లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థి విషయంలో కార్యకర్తల మధ్య విభేధాలు చోటు చేసుకున్న సమయంలో…మనమందరం బీజేపీ వర్కర్లమని,మనకు బీజేపీ గెలవడం ముఖ్యమని,ప్రతి ఒక్కరూ మళ్లీ మోడీనే ప్రధానిగా కోరుకుంటున్నారని కళ్యాణ్ సింగ్ అన్నారు.
స్వతంత్ర భారతదేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎన్నికల ప్రవర్తనా నియమావళి)ను ఓ గవర్నర్ ఉల్లఘించి ప్రధానమంత్రి కోసం ప్రచారం చేయడం ఇదే మొదటిసారి.రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్న గవర్నవర్ వంటి వాళ్లకు కోడ్ వర్తించదు.అయినప్పటికీ కళ్యాణ్ సింగ్ యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉండాల్సిందేనని రాష్ట్రపతి కార్యాలయం సృష్టం చేసింది.ఎన్నికల ప్రచారానికి రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్నవారికి అనుమతి లేదంటూ సృష్టం చేసింది.ఈ విషయంలో గవర్నర్ పై ఫిర్యాదుకు కాంగ్రెస్ రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోరింది.
1990ల్లో మధ్యప్రదేశ్ లో ఓ గవర్నర్ తన కొడుకు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించి తన గవర్నర్ పదవికి బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది.ఆ సమయంలో ఆ నియోజకవర్గంలో ఓటింగ్ ను కూడా ఎలక్షన్ కమిషన్ రద్దు చేసింది.