Independence Day 2023: ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. ముఖ్యమైన అంశాలు ఇవే..
ఎర్రకోటలో ప్రధాని మోడీకి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సహాయ మంత్రి అజయ్ భట్, కార్యదర్శి అమరనే గిరిధర్ స్వాగతం పలికారు.
PM Narendra Modi: 77వ స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలను జరుపుకునేందుకు దేశమంతా సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట ముందు జ్ఞానపథ్‌లో పుష్పాలంకరణలో G20 లోగో ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి ఈ వేడుకల్లో 1100మంది విద్యార్థులు, ఎన్‌సీసీ కేడెట్లు పాల్గొన్నారు.
ఎర్రకోటవద్ద ఢిల్లీ పోలీసులు, త్రివిధ దళాల గౌరవ వందనంను ప్రధాని మోదీ స్వీకరించారు. ఎర్రకోటలో ప్రధాని మోడీకి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సహాయ మంత్రి అజయ్ భట్, కార్యదర్శి అమరనే గిరిధర్ స్వాగతం పలికారు. ఢిల్లీ ప్రాదేశిక లెఫ్టినెంట్ జనరల్/జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జిఒసి) ధీరజ్ సేఠ్‌ను ప్రధానమంత్రికి రక్షణశాఖ కార్యదర్శి పరిచయం చేశారు. ప్రధాని మోడీకి ఢిల్లీ సంయుక్త ఇంటర్-సర్వీసెస్, ఢిల్లీ పోలీస్ గార్డ్ బలగాలు వందన సమర్పణ చేశాయి. ఆ తర్వాత సైనిక బలగాల గౌరవ వందనాన్ని ప్రధాని మోదీ స్వీకరించారు.
గౌరవ వందన కవాతు బృందంలో ఆర్మీ, వైమానిక దళం, ఢిల్లీ పోలీసు విభాగం నుంచి ఒక్కొక్క అధికారితోపాటు 25 మంది సిబ్బంది. నావికాదళం నుంచి ఒక అధికారితోపాటు 24 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఏడాది కవాతు సమన్వయ బాధ్యతను భారత సైన్యం నిర్వర్తించింది. గౌరవ వందనానికి మేజర్ వికాస్ సంగ్వాన్ నాయకత్వం వహించారు. ప్రధానమంత్రి రక్షణ బృందంలోని సైనిక సిబ్బందికి మేజర్ ఇంద్రజీత్ సచిన్, నావికాదళానికి లెఫ్టినెంట్ కమాండర్ ఎం.వి రాహుల్ రామన్, వైమానిక దళానికి స్క్వాడ్రన్ లీడర్ ఆకాష్ గంగాస్ నాయకత్వం వహించారు. ఢిల్లీ పోలీసు బృందానికి అదనపు డీసీపీ సంధ్యా స్వామి నేతృత్వం వహించారు.
ప్రధానమంత్రి గౌరవ వందనం స్వీకరించాక ఎర్రకోట బురుజులపైకి చేరుకున్నారు. పతాకావిష్కరణ సమయంలో 20 మంది ఇతర ర్యాంకులుగల ఆర్మీ వాద్యదళం జాతీయ గీతాన్ని ఆలపించింది. నాయబ్ సుబేదార్ జతీందర్ సింగ్ ఆధ్వర్యంలో ఈ దళం తమ నైపుణ్యం ప్రదర్శించింది. ఉదయం 7.30 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు.