‘పవిత్రపతి’ని కట్టుకుంటే కరోనా రమ్మన్నా రాదు..

  • Published By: nagamani ,Published On : June 15, 2020 / 09:28 AM IST
‘పవిత్రపతి’ని కట్టుకుంటే కరోనా రమ్మన్నా రాదు..

Updated On : June 15, 2020 / 9:28 AM IST

 ‘పవిత్రపతి’ని కట్టుకుంటే కరోనా మహమ్మారి రాదు.  ‘పవిత్రపతి’ అంటే పవిత్రమైన భర్త కాదండోయ్..కరోనా మహమ్మారి రాకుండా ఉండాలంటే ‘‘మాస్క్’’  ప్రధాన రక్షణకవచం అనే విషయం నేటికరోనాకాలంలో అందరికీ తెలిసిందే. కానీ ఈ ‘పవిత్రపతి’ ఏంటీ అనుకుంటున్నారా? మరి ఆ వివరాలేంటో తెలుసుకోవాలనుకుంటున్నారు కదూ..

 కరోనా నుంచి కాపాడుకోవటానికి మార్కెట్ లో చాలా రకాల మాస్కులే వస్తున్నాయి. ఈ మాస్క్ కట్టుకుంటే కరోనా సమస్యే ఉండదనే మాటలు వింటున్నాం. ఈ క్రమంలో కెమికల్ మాస్కులకు బదులుగా వనమూలికలను రంగరించి కొత్తరకం మాస్క్ సిద్ధం చేసింది పుణేలోని డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ (డీఐఏటీ).

ఇది పూర్తి ప్రకృతి సిద్ధమైన వస్తువులతో తయారు చేశామని చెబుతున్నారు నిర్వాహకులు. తులసి, వేపనూనె, పసుపు, మిరియాలు, గంధం, కుంకుమపువ్వు వంటి మూలికలతో తయారుచేసిన ఈ మాస్క్ కు  ‘పవిత్రపతి’ అని పేరు కూడా పెట్టారు. 

ఒకటీ రెండూ కాదు మూడు పొరలతో తయారు చేసిన ఈ మాస్క్ బ్యాక్టీరియాతోపాటు వైరస్, ఫంగస్‌లను సమర్థంగా అడ్డుకుంటుందని డీఐఏటీ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ బాలసుబ్రమణియన్ వెల్లడించారు. మిగతా మాస్కులు వాడి పడేసిన తరువాత అవి భూమిలో కలవటానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కానీ ‘పవిత్రపతి’ మాస్క్ వాడి పడేసిన తర్వాత దానంతట అదే భూమిలో కలిసిపోతుందని, ప్లాస్టిక్‌లా హానికరం కాదని తెలిపారు. 
‘పవిత్రపతి’ మాస్కులను మార్కెట్ కోసం తయారు చేస్తామని మూడు కంపెనీలు ముందుకొచ్చాయని త్వరలోనే ఇవి మార్కెట్ లోకి వస్తాయని తెలిపారు.

అమెరికన్ సొసైటీ ఫర్ టెస్టింగ్ అండ్ మెటీరియల్స్ ప్రమాణాల ద్వారా వీటి నమూనాలను పరీక్షించామని..చక్కటి ఫలితాలు వచ్చాయని తెలిపారు.