స్టేడియం గ్యాలరీ నుంచి పాక్ క్రికెటర్ల ఫొటోలు తొలగింపు

పుల్వామా దాడితో దేశం మొత్తం పాకిస్థాన్ పై ప్రతీకారంతో రగిలిపోతోంది. పాక్ కోరలు పీకేందుకు అన్ని ప్రయత్నాలు జరుుతున్నాయి. ఈ సమయంలో పంజాబ్ క్రికెట్ అసోషియేషన్(PAC) తీసుకొన్న నిర్ణయం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలోని మొహాలి క్రికెట్ స్టేడియంలో ఉన్న 15 మంది పాకిస్తాన్ క్రికెటర్ల ఫొటోలను PAC తొలగించింది. మొహాలీలో అరుదైన ఘనతలు సాధించిన క్రికెటర్ల ఫొటోలను స్టేడియం గ్యాలరీలో సుదీర్ఘకాలంగా ఉంచుతున్నారు. ఈ సంప్రదాయంలో భాగంగా పాక్‌కి చెందిన క్రికెటర్ల ఫొటోలు కూడా అందులో ఉన్నాయి. అయితే పుల్వామా ఉగ్రదాడితో దేశ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ పంజాబ్ క్రికెట్ అసోషియేషన్ ఆ ఫొటోల్ని తొలగించాలని ఆఫీస్ బేరర్స్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంది.
PCA చాలా గౌరవప్రదమైన నిర్ణయం తీసుకుంది. జవాన్ల కుటుంబాలకి మేము ఇస్తున్న గౌరవం ఇది అంటూ అమరులైన వీర జవాన్లకి నివాళిగా స్టేడియంలోని పాక్ క్రికెటర్ల ఫొటోలను తొలగించారు. అమర జవాన్ల పిల్లల చదువు బాధ్యతను తాను తీసుకుంటానని ఇప్పటికే మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రకటించగా.. ఆర్థిక సాయం చేసేందుకు ఓపెనర్ శిఖర్ ధావన్, బాక్సర్ విజేందర్ సింగ్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తో పాటు కొంత మంది క్రికెటర్లూ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.