హిమాచల్‌ ప్రదేశ్‌లో ‘పుష్ప’ మూవీ సీన్.. ‘హిమాచల్ పుష్పరాజ్ ఎక్కడ..?’ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్.. వీడియో వైరల్

పండోహ్ డ్యామ్‌లోకి భారీగా వరద నీటితోపాటు టన్నుల కొద్దీ కలప దుంగలు కొట్టుకురావడంతో హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ దుమారం చెలరేగింది.

హిమాచల్‌ ప్రదేశ్‌లో ‘పుష్ప’ మూవీ సీన్.. ‘హిమాచల్ పుష్పరాజ్ ఎక్కడ..?’ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్.. వీడియో వైరల్

Updated On : June 29, 2025 / 8:57 AM IST

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లూ జిల్లాలో కొద్దిరోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డు ఆధీనంలోని పండోహ్ డ్యామ్ లోకి భారీగా వరద నీరు చేరింది. వరద నీటితోపాటు ‘పుష్ప’ సినిమాలో సీన్ మాదిరిగా.. టన్నుల కొద్దీ కలప దుంగలు కొట్టుకొచ్చాయి. అవన్నీ డ్యామ్ వద్ద పేరుకుపోయాయి. డ్యామ్ కు ప్రమాదం వాటిల్లకుండా అధికారులు ఐదు గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ఆ కలప దుంగలన్నీ నదిపై తేలుతూ కిలోమీటర్ల మేర కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


బీబీఎంబీ డ్యామ్‌లో కిలోమీటర్ల కొద్ది పేరుకుపోయిన టన్నులకొద్దీ దుంగలు, నదిలో కొట్టుకుపోతున్న దుంగల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘హిమాచల్ పుష్పరాజ్ ఎక్కడా..? ’ అంటూ సరదాగా పుష్ప సినిమాలోని డైలాగ్‌లు పెడుతున్నారు. ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియాలో ‘హిమాచల్‌లో పుష్ప పాలన ఉంది, చట్టం కాదు’ అంటూ ట్వీట్ చేసింది.


పండోహ్ డ్యామ్ లోకి భారీగా వరద నీటితోపాటు టన్నుల కొద్దీ కలప దుంగలు కొట్టుకురావడంతో హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయ దుమారం చెలరేగింది. అధికార పార్టీపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. రాష్ట్రంలో అక్రమంగా చెట్ల నరికివేత ఏ స్థాయిలో జరుగుతుందో ఈ దృశ్యాలే నిదర్శనమని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అంటూ ఆరోపిస్తున్నాయి. సొంత పార్టీ ప్రభుత్వంపైనే కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ రాఠౌర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర అటవీ శాఖ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని ఆయన విమర్శించారు.