Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ పొడిగింపు

రాహుల్ గాంధీకి బెయిల్ పొడిగింపు కాస్త ఊరటనిచ్చే అంశమే. అయితే, ట్రయల్ కోర్టు తీర్పుపై మధ్యంతర స్టే మాత్రం ఇవాళ దక్కలేదు.

Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ పొడిగింపు

Rahul Gandhi

Updated On : April 3, 2023 / 4:12 PM IST

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గుజరాత్ లోని సూరత్ సెషన్స్ కోర్టులో ఇవాళ ఊరట దక్కలేదు. గతంలో ప్రధాని మోదీ ఇంటి పేరు విషయంలో రాహుల్ గాంధీ పలు వ్యాఖ్యలు చేయగా, పరువు నష్టం కేసులో రాహుల్ ను ట్రయల్స్ కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు రెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది.

అయితే, ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సెషన్స్ కోర్టులో అప్పీలు చేశారు రాహుల్ గాంధీ. అదే ఇవాళ విచారణకు వచ్చింది. సెషన్స్ కోర్టు మధ్యంతర స్టే ఇవ్వలేదు. రాహుల్ గాంధీకి బెయిల్ ను మాత్రం ఈ నెల 13 వరకు పొడిగించింది. ఆయన అభ్యర్థనపై తదుపరి విచారణను కూడా అదే రోజుకి వాయిదా వేసింది.

రాహుల్ గాంధీతో పాటు కోర్టు వద్దకు కాంగ్రెస్ నాయకురాలు, ఆయన సోదరి ప్రియాంకా గాంధీ, సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేశ్ భఘెల్ కోర్టుకు వచ్చారు. మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా కోర్టు వద్ద కనపడ్డారు. రాహుల్ గాంధీకి బెయిల్ పొడిగింపు ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ, ట్రయల్ కోర్టు తీర్పుపై మధ్యంతర స్టే విధించకపోవడం మాత్రం ఆయనకు షాక్ ఇచ్చే విషయం. ఈ నెల 13న కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

రాహుల్ గాంధీపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేణ్ మోదీ గతంలో పరువు నష్టం దావా వేశారు. ఆయన ఏప్రిల్ 10లోపు కోర్టుకు వచ్చి, రాహుల్ తాజాగా చేసుకున్న అభ్యర్థనపై సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడిన నేపథ్యంలో ఇప్పటికే లోక్ సభ సభ్యత్వంపై కూడా వేటు పడింది.

Rahul Gandhi: సూరత్ కోర్టుకు బయల్దేరిన రాహుల్.. తోడుగా ప్రియాంక, కాంగ్రెస్ సీఎంలు