రాజా రఘువంశీ ఫ్యామిలీ ఎమోషనల్ నిర్ణయం.. సోనమ్ అతడ్ని హత్య చేసిన చోట..
రాజా రఘువంశీ సోదరుడు విపిన్, అతని కుటుంబ సభ్యులు తూర్పు ఖాసీ హిల్స్‌లోని వీసావ్‌డాంగ్ జలపాతం వద్ద పార్కింగ్ స్థలాన్ని సందర్శించారు. ఆ తరువాత అతను హత్యకు గురైన ప్రదేశంను సందర్శించారు.

Raja Raghuvanshi case
Raja Raghuvanshi: ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజా రఘువంశీకి సోనమ్‌తో ఈ ఏడాది మే11వ తేదీన వివాహం జరిగింది. పెళ్లి చేసుకున్న తొమ్మిది రోజుల తరువాత దంపతులు మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లారు. మే23న అతని భార్య, తన ప్రియుడు మరో ముగ్గురుతో కలిసి రాజా రఘువంశీని హత్యచేశారు. పదకొండు రోజుల తరువాత రఘువంశీ మృతదేహం లభ్యమైంది.
అయితే, ఈ కేసుపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే సోనమ్ రఘువంశీతోపాటు ఆమె ప్రియుడు, మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. తాజాగా.. మేఘాలయంలోని రఘువంశీ మృతదేహం లభ్యమైన ప్రదేశాన్ని అతని కుటుంబం సందర్శించింది.
రాజా రఘువంశీ సోదరుడు విపిన్, అతని కుటుంబ సభ్యులు తూర్పు ఖాసీ హిల్స్‌లోని వీసావ్‌డాంగ్ జలపాతం వద్ద పార్కింగ్ స్థలాన్ని సందర్శించారు. ఆ తరువాత అతను హత్యకు గురైన ప్రదేశంను సందర్శించారు. జూన్ 2న మేఘాలయలో రాజా మృతదేహం లభ్యమైన ప్రదేశంలోనే మతపరమైన ఆచారాలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు విపిన్ రఘువంశీ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ లో మీడియా సమావేశంలో తెలిపారు. ఈ క్రమంలో ఆ కుటుంబం మంగళవారం షిల్లాంగ్ చేరుకొని, అక్కడి నుంచి బుధవారం సోహ్రాకు చేరుకున్నారు.
రాజా రఘువంశీ హత్య కేసుకు సంబంధించి అరెస్టయిన ప్రాపర్టీ డీలర్ సిలోమ్ జేమ్స్‌కు మేఘాలయలోని తూర్పు ఖాసీహిల్స్ జిల్లాలోని కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఆ బెయిల్‌ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేయడానికి షిల్లాంగ్‌లోని న్యాయవాదిని నియమిస్తామని రాజా రఘువంశీ కుటుంబం తెలిపింది.
వివాహం తర్వాత సోనమ్ తన భర్తను ఎందుకు హత్య చేసిందో అసలు కారణాన్ని తెలుసుకోవడానికి ఆమెకు నార్కో పరీక్ష నిర్వహించాలని తమ కుటుంబం కూడా పిటిషన్ దాఖలు చేస్తుందని విపిన్ చెప్పారు. మరోవైపు.. సోనమ్ అన్నయ్య గోవింద్ ఆమె విడుదలకోసం బెయిల్ దరఖాస్తు దాఖలు చేయడానికి షిల్లాంగ్, అస్సాంలోని గౌహతిలో న్యాయవాదిని నియమించుకోవాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే, ఆమె కుటుంబం ఆ విషయాన్ని ధృవీకరించలేదు.