Rajasthan Govt Crisis : రంగంలోకి రాహుల్..పైలట్ అలక వీడుతారా

రాజస్థాన్ కాంగ్రెస్‌లో సంక్షోభం మరో మలుపు తిరిగింది. తాను బీజేపీలో చేరటం లేదని సచిన్ పైలట్ ప్రకటించారు. దాంతో పైలట్‌ను బుజ్జగించి తిరిగి పార్టీ గూటికి రప్పించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాహుల్ గాంధీయే స్వయంగా రంగంలోకి దిగి పైలట్‌కు సానుకూల సందేశం పంపినట్టు తెలిసింది. సచిన్‌పై బహిరంగంగా విమర్శలు చేయరాదని హైకమాండ్ సీఎం గెహ్లాట్‌కు హుకుం జారీ చేసింది.
పార్టీ విప్ ధిక్కరించిన సచిన్ సహా 19 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పైలట్‌కు కాంగ్రెస్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని పార్టీ కార్యదర్శి రణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా అన్నారు. కాంగ్రెస్ సంక్షోభంపై మొదట దూకుడుగా వ్యవహరించిన బీజేపీ… తాజా పరిణామాలతో వేచిచూసే ధోరణి ప్రదర్శిస్తోంది.
సచిన్ పైలట్‌పై కాంగ్రెస్ పార్టీ పిడికిలి వ్యూహాన్ని అమలుచేస్తున్నది. నలుదిశలనుంచి సున్నితంగా పట్టు బిగించి ఒత్తిడి తెస్తున్నది. పైలట్‌పై తన ప్రత్యర్థి, రాజస్థాన్ సీఎం గెహ్లాట్ విమర్శలు గుప్పిస్తుండగా… పార్టీ అధిష్ఠానం మాత్రం ఆయనను పల్లెత్తు మాట అనకుండా సున్నితంగా వ్యవహరిస్తున్నది.
బుధవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించిన పైలట్, సీఎం గెహ్లాట్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ హైకమాండ్ ముందు తనను దోషిగా నిలబెట్టేందుకు గెహ్లాట్, ఆయన మిత్రులు ఎంతోకాలంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పైలట్ విమర్శలను సీఎం గెహ్లాట్ తిప్పికొట్టారు. బీజేపీతోకలిసి పైలట్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని విమర్శించారు.
కొంతకాలంగా బీజేపీలో చేరుతారని జరుగుతున్న ప్రచారానికి స్వయంగా సచిన్ పైలటే తెరదించారు. తాను బీజేపీలో చేరబోవడం లేదని స్పష్టం చేశారు. దీంతో ఇక ఆయన దారెటు అన్న చర్చ మొదలైంది. ఆయన అనుచర ఎమ్మెల్యేలు కొందరు పైలట్ సొంతపార్టీ పెడుతారని చెప్తున్నప్పటికీ ఆయననుంచి అలాంటి సంకేతాలేవీ ఇప్పటికీ వెలువడలేదు.
గెహ్లాట్‌పైనే తప్ప కాంగ్రెస్ అధిష్ఠానానికి వ్యతిరేకంగా పైలట్ ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తాజాగా పైలట్‌ను బుజ్జగించేందుకు ఏకంగా రాహుల్‌గాంధీయే రంగంలోకి దిగటంతో పైలట్ తిరిగి సొంతగూటికి చేరే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.