Rajasthan Govt : రెస్టారెంట్ సిబ్బందిపై దాడి చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సస్పెండ్

శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు అధికారులే విఘాతం కలిగించారు. ఓ రెస్టారెంట్ సిబ్బందిపై రాత్రి సమయంలో రెచ్చిపోయారు. చెప్పుతో చెంప ఛెళ్లుమనిపించారు.

Rajasthan Govt : రెస్టారెంట్ సిబ్బందిపై దాడి చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సస్పెండ్

Rajasthan Govt suspends IPS, IAS Officers.

Rajasthan Govt suspends IPS, IAS Officers : పోలీసులంటే శాంతి భద్రతల్ని కాపాడాలి. ఎవరైనా పబ్లిక్ ప్లేసుల్లో గొడవపడినా..శాంతి భద్రతలకు భంగం వాటిల్లే చేసినా వారిని మందలించాలి..గొడవలను అదుపు చేయాలి. కానీ పోలీసులే శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా చేస్తే..ఏకంగా దాడి చేస్తే ఇక సమాజం పరిస్థితి ఏంటీ? అదే జరిగింది రాజస్ధాన్ లో. ఐఏఎస్, ఐపీఎస్ స్థాయిల్లో ఉన్న వారు ఓ రెస్టారెంట్ సిబ్బందిపై దాడి చేశారు. ఇష్టానురీతిగా కొట్టారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ప్రభుత్వం స్పందించింది. సదరు ఐఏఎస్, ఐపీఎస్ లను సస్పెండ్ చేసింది. వారు చేసిన దానిపై విచారణకు ఆదేశించింది.

రాజస్థాన్‌లోని జైపూర్-అజ్మేర్ హైవేపై ఉన్న ఓ రెస్టారెంట్ లో గత ఆదివారం (జూన్11,2023)పోలీసులు జులుం ప్రదర్శించారు. రెస్టారెంట్ సిబ్బందిపై దాడి చేశారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ టీవీలో రికార్డు అయ్యింది. ఈ వీడియో వైరల్ కావటంతో రాజస్థాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దీనికి కారణమైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోపాటు మొత్తం ఐదుగురిని సస్పెండ్ చేసింది. రెస్టారెంట్ సిబ్బందిపై దాడి చేసి సస్పెండ్ అయినవారిలో అజ్మేర్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ గిరిధర్, ఐపీఎస్ అధికారి సుశీల్ కుమార్ బిష్ణోయ్‌ లు ఉన్నారు. వీరితో పాటు ఓ కానిస్టేబుల్, ఇద్దరు ప్రభుత్వాధికారులు కూడా ఉన్నారు.

గంగాపూర్ సిటీ పోలీస్ విభాగానికి బిష్ణోయ్ ఓఎస్డీగా నియమితులయ్యారు. ఈక్కరమంలో వారు పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీకి వెళ్లి వస్తుండగా దారిలో ఉన్న ఓ రెస్టారెంట్ వద్ద ఆగారు. అప్పటికే రెస్టారెంట్ మూసివేశారు. పోలీసులకు వాష్‌రూమ్ అవసరం పడింది. దీంతో వారు వాష్‌రూమ్ ఉపయోగించుకోవటానికి రెస్టారెంట్‌ను ఓపెన్ చేయమని అడిగారు. ఈక్రమంలో రెస్టారెంట్ సిబ్బందికి, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అధికారులు పోలీసులు చెబితే ఓపెన్ చేయరా? అంటూ రెచ్చిపోయారు. రెస్టారెంట్ సిబ్బందిలో ఒకరిపై ఐపీఎస్ అధికారి చెప్పుతో కొట్టారు. దీంతో రెస్టారెంట్ సిబ్బంది పోలీసులపై ఎదురు తిరిగటంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది.

కానీ అలా వెళ్లిపోయిన తరువాత కాసేపటికే మరింతమంది పోలీసులతో వచ్చి రెస్టారెంట్ సిబ్బందిపై దాడిచేశారని..ఈడ్చిపడేశారని రెస్టారెంట్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. కానీ తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని ఐపీఎస్ అధికారి బిష్ణోయ్ కొట్టిపారేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు. రెస్టారెంట్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించామని రాజస్థాన్ పోలీస్ చీఫ్ ఉమేశ్ మిశ్రా తెలిపారు.