Red Fort : ద్యావుడా.. ఎర్రకోట నాదే అంటూ ఢిల్లీ హైకోర్టులో మహిళ పిటిషన్.. పెన్షన్ సరిపోవడం లేదని ఆవేదన
ఢిల్లీ హైకోర్టులో ఆసక్తికరమైన పిటిషన్ ఒకటి దాఖలైంది. దేశ రాజధాని హస్తినలో ఉన్న ఎర్రకోట తనదేనంటూ ఓ మహిళ కోర్టుని ఆశ్రయించింది.

Red Fort
Red Fort : ఢిల్లీ హైకోర్టులో ఆసక్తికరమైన పిటిషన్ ఒకటి దాఖలైంది. దేశ రాజధాని హస్తినలో ఉన్న ఎర్రకోట తనదేనంటూ ఓ మహిళ కోర్టుని ఆశ్రయించింది. సుల్తానా బేగం అనే మహిళ ఈ పిటిషన్ వేసింది. ఆమె తనను తాను మొఘలుల చివరి రాజు బహదూర్ షా మునిమనవడు మీర్జా మహ్మద్ బీదర్ భక్త్ భార్యనని చెప్పుకుంటోంది. ఎర్రకోటను తనకు అప్పగించడమో, లేక తగిన పరిహారం చెల్లించడమో చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ తన పిటిషన్ లో కోరింది.
”ఢిల్లీ రాజు బహదూర్ షా జాఫర్-2కు నిజమైన వారసురాలిని నేనే. 1857లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ వర్గాలు బహదూర్ షాను పదవీచ్యుతుడిని చేశాయి. బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ ఆయన ఆస్తులన్నింటినీ అక్రమంగా లాగేసుకుంది. ” అని ఆ మహిళ అంటోది. 1960లో భారత ప్రభుత్వం బహదూర్ షా జాఫర్-2 వారసుడిగా బీదర్ భక్త్ పేరును పేర్కొన్నట్టు ఆమె వివరించింది.
ఆ బీదర్ భక్త్ తన భర్తేనని, మే 22న 1980లో ఆయన మరణానంతరం 1980 ఆగస్టు 15 నుంచి భారత ప్రభుత్వం తనకు పెన్షన్ ఇవ్వసాగిందని సుల్తానా బేగం కోర్టుకు తెలిపింది. ఆ పెన్షన్ తమకు ఏ మూలకు సరిపోవడం లేదని విచారం వ్యక్తం చేసింది. అంతేగాకుండా, కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ఎర్రకోటను అక్రమంగా తన అధీనంలో ఉంచుకుందని, అది తమ పూర్వీకుల ఆస్తి అని ఆమె వాదిస్తోంది. అందుకే ఎర్రకోటను తమకు అప్పగించాలని కోరుతున్నామని, 1857 నుంచి వర్తించేలా నష్టపరిహారం చెల్లించాలని ఆమె కోర్టుని డిమాండ్ కోరింది.
ICAR IARI Recruitment 2021: పది పాస్ అయితే చాలు.. 641 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..
అయితే ఈ పిటిషన్ ను జస్టిస్ రేఖా పల్లీ ధర్మాసనం కొట్టివేసింది. ఇన్నాళ్లు ఏం చేశారంటూ ధర్మాసనం పిటిషనర్ ను ప్రశ్నించింది. ఈ సందర్భంగా సుల్తానా బేగం తరఫు న్యాయవాది స్పందిస్తూ, తన క్లయింట్ నిరక్షరాస్యురాలని, అందుకే కోర్టును ఆశ్రయించ లేదని వివరించే ప్రయత్నం చేశారు. ఈ వివరణ తమకు ఆమోదయోగ్యం కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.