Rajasthan Polls: రాజస్థాన్లో అలా జరిగిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీనే గెలిచింది.. నిన్నటి ఎన్నికల్లో మళ్లీ అదే జరిగింది
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 101 సీట్లు అవసరం కాగా, ఒక సీటు వెనుకంజలో కాంగ్రెస్ నిలిచింది. అంతకు ముందు 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 75.67 శాతం ఓటింగ్ నమోదు అయింది

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగులో చాలా చోట్ల ఓట్ల శాతంలో హెచ్చుతగ్గులు కనిపించాయి. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ఓటింగ్ స్వల్పంగా తగ్గింది. ఈసారి 74.13 శాతం ఓటింగ్ నమోదు అయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 74.72 శాతం పోలింగ్ నమోదు అయింది. అంటే ఈసారి 0.59 శాతం ఓటింగ్ తగ్గింది. ఎన్నికల్లో ప్రజల ఆసక్తి, ఓటింగ్ శాతం తగ్గడం పట్ల ఎవరికి లాభం అనే దానిపై చర్చ మొదలైంది. ఎవరి అంచనాలు, విశ్లేషణలు వారికే ఉన్నప్పటికీ వాస్తవ ఫలితాలు కోసం అందరూ డిసెంబర్ 3 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఓటింగ్ శాతాన్ని బట్టి ఒంటె ఏ వైపు కూర్చుంటుందో అంచనా వేయవచ్చు. గత ఐదు అసెంబ్లీ ఎన్నికల లెక్కలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో ఓటింగ్ శాతం తగ్గినప్పుడల్లా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని అంచనా. ఓటింగ్ శాతం పెరిగితే బీజేపీకి లాభం. ఈ ఏడాది ఓటింగ్ శాతం స్వల్పంగా తగ్గింది. అయితే హాట్ సీట్లలో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. 2013 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2018లో కూడా ఓటింగ్ తగ్గింది. ఆ ఎన్నికల్లో 0.95 శాతం ఓటింగ్ తగ్గింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 101 సీట్లు అవసరం కాగా, ఒక సీటు వెనుకంజలో కాంగ్రెస్ నిలిచింది. అంతకు ముందు 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 75.67 శాతం ఓటింగ్ నమోదు అయింది. అంతకు ముందు ఎన్నికలతో పోలిస్తే అది 9.42 శాతం ఎక్కువ. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. మరి ఈసారి తగ్గిన ఓటింగ్ శాతంతో సంప్రదాయం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందా.. లేదంటే దాన్ని తలకిందులు చేస్తూ బీజేపీకి కలిసి వస్తుందగా డిసెంబర్ 3న తెలుస్తుంది.