శశికళకు జైలులో రాజభోగాలు: ముందస్తు విడుదల లేనట్లే!

  • Published By: vamsi ,Published On : October 10, 2019 / 02:51 AM IST
శశికళకు జైలులో రాజభోగాలు: ముందస్తు విడుదల లేనట్లే!

Updated On : October 10, 2019 / 2:51 AM IST

అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో ఉంటున్న మాజీ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళకు విలాసవంతమైన సదుపాయాలు అందిన మాట వాస్తవమే అని విచారణ కమిటీ నిర్ధారణకు వచ్చింది.. అక్రమంగా సంపాదించిన కేసులో సుప్రీంకోర్టు శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించగా.. ఆమె బెంగళూరులోని జైలులో శిక్ష అనుభవిస్తుంది.

రెండేళ్లకు పైగా జైలులో ఉంటున్న ఆమెకు అగ్రహారం జైలులో ప్రత్యేకంగా ఐదు గదులు, విలాసవంతమైన పరుపులు, వంటగది తదితర సదుపాయాలు కల్పించి ఉండటం చూసి అప్పట్లో జైళ్ల శాఖ మాజీ డీఐజీ రూప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జైలులో సదుపాయాలు పొందటానికి జైలు అధికారులకు శశికళ రెండు కోట్లకు పైగా ముడుపులు చెల్లించారంటూ రూప విచారణలో కనుక్కోగా.. ఇంకా శశికళ చుడీదార్‌ ధరించి జైలు నుంచి బయటకు వెళ్ళి షాపింగ్‌ చేసుకుని తిరిగి వస్తున్న వీడియోను కూడా ఆమె విడుదల చేశారు.

శశికళకు జైలులో అందిన రాజభోగాలు, ముడుపుల వ్యవహారం, అధికారుల గురించి సమగ్రమైన నివేదికను రూపొందించి ఉన్నత అధికారులకు సమర్పించారు రూప. ఈ క్రమంలో ఆరోపణలపై సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వినయ్‌కుమార్‌ నేతృత్వంలో ఓ విచారణ కమిటీని నియమించింది కర్ణాటక ప్రభుత్వం. వినయ్‌కుమార్‌ కమిటీ విచారణ జరిపి ఇటీవలే ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో శశికళకు విలాసవంతమైన సదుపాయాలు కల్పించడం వాస్తవమని ఆధారాలతో సహా వెల్లడించింది.

శశికళ సదుపాయాల కోసం అప్పటి జైలు అధికారి సత్యనారాయణకు రూ.2 కోట్లకు పైగా ముడుపులు ఇచ్చినట్లు కమిటీ నిర్ధారించింది. దీనితో శశికళకు జైలు శిక్ష పొడిగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ముందస్తు విడుదల చేస్తారని ఇప్పటివరకు అందరూ భావించగా.. ఇక అటువంటి అవకాశం లేకుండా పోయింది.