రిపబ్లిక్ డే 2019 : ఢిల్లీ ముస్తాబు

  • Published By: madhu ,Published On : January 24, 2019 / 09:29 AM IST
రిపబ్లిక్ డే 2019 : ఢిల్లీ ముస్తాబు

Updated On : January 24, 2019 / 9:29 AM IST

ఢిల్లీ : రిపబ్లిక్ డే వేడుకలకు దేశ రాజధాని ముస్తాబవుతోంది. 70వ గణతంత్ర దినోత్సవం..మరోవైపు బాపూజీ 150వ జయంతి ఉండడంతో వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. అందుకనుగుణంగా ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. గాంధీని స్మరించుకొనేలా కార్యక్రమాలకు సన్నాహాలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీ రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముమ్మరంగా వాహనాలను తనిఖీలు చేపడుతున్నారు. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 
పరేడ్ రిహార్సల్స్ : 
మరోవైపు రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా రాజ్ పథ్‌లో పరేడ్ రిహార్సల్స్ కూడా జరిగాయి. ఈ రిహార్సల్స్ చూసేందుకు పాఠశాలల విద్యార్థులకు అనుమతినిచ్చారు. ఈ పరేడ్ చూసిన వారూ సంతోషం వ్యక్తం చేశారు. పరేడ్ అద్బుతంగా ఉందంటూ విద్యార్థులు పేర్కొన్నారు. 
ముఖ్య అతిథి సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు : 
ఈ ఏడాది సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు, బ్రిక్స్‌ దేశాల భాగస్వామి సిరిల్‌ రాంపోసా ముఖ్య అతిధిగా రానున్నారు. రిపబ్లిక్ డేని..గణతంత్ర దినోత్సవం అని కూడా అంటారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. బాపూజీ జీవితాన్ని ప్రతిబింబించేలా శకటాలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రముఖ విదేశీ అతిధుల కోసం ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు.