TRP స్కామ్ లో రిపబ్లిక్ టీవీ సహా మూడు ఛానళ్లు

  • Published By: venkaiahnaidu ,Published On : October 8, 2020 / 05:59 PM IST
TRP స్కామ్ లో రిపబ్లిక్ టీవీ సహా మూడు ఛానళ్లు

Updated On : October 8, 2020 / 7:23 PM IST

Ratings Manipulation: Republic TV Among 3 Channels ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ రిపబ్లిక్‌ టీవీ సహా మూడు వార్తా ఛానళ్లు టీఆర్పీ రేటింగ్స్‌ మ్యానిపులేషన్(తారుమారు)కు పాల్పడినట్లు ముంబై పోలీస్ చీఫ్ పరంవీర్ సింగ్ తెలిపారు. దీనికి సంబంధించి తమ దగ్గర ఆధారాలున్నాయని ఆయన తెలిపారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చెప్పారు. అరెస్ట్ అయిన ఇద్దరిలో ఒకరు.. రేటింగ్స్ ను అంచనావేసే పీపుల్ మీటర్స్ ను ఇన్ స్టాల్ చేసే ఓ ఏజెన్సీ మాజీ ఉద్యోగి అని తెలిపారు.


ఆ మూడు వార్తా ఛానళ్ల బ్యాంక్ అకౌంట్స్ ను పరిశీలించనున్నట్లు తెలిపారు. రేటింగ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడే ఏ చానల్‌ను వదిలిపెట్టమని పేర్కొన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నా..ఎంత పెద్ద మేనేజ్ మెంట్ ఉన్నా..ఎంత సీనియర్ అయినా వదిలిపెట్టే ప్రశక్తే లేదన్నారు. వారందరినీ ప్రశ్నించడం జరుగుతుందని తెలిపారు. నేరం జరిగినట్లు తేలితే…వారి ఛానల్ బ్యాంకు అకౌంట్లు సీజ్ చేయడం జరగుతుందని,కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సింగ్ తెలిపారు.


రేటింగ్స్ మ్యానిప్యులేషన్ కోసం న్యూస్ ఛానళ్లు ఇళ్ల డేటాను వాడారని,అక్రమ ప్రకటనల ఫండ్స్ పొందారని..దీన్ని చీటింగ్ గా పరిగణించనున్నట్లు సింగ్ తెలిపారు. తప్పుడు టీఆర్పీ వ్యాప్తి జరుగుతుందని…ముఖ్యంగా ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కోసమే ఈ మ్యానిపులేషన్ జరుగుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఒకే చానల్‌ను స్థిరంగా పెట్టి దాన్నే చూసేందుకు ఇంటికి నెలకు రూ.400 నుంచి 500 వరకు ఇస్తున్నారన్నారు. నిరక్షరాస్యులు ఉన్న ఇళ్లల్లో కూడా నిరంతరం ఇంగ్లీష్ న్యూస్ ఛానళ్లు పెట్టేందుకు డబ్బులు ఇవ్వబడుతున్నాయని సింగ్ తెలిపారు.