ఆర్జేడీ సంచలన ఆరోపణ…ఎన్నికల అధికారులపై నితీష్,మోడీ ఒత్తిడి తెచ్చారు

RJD Accuses Nitish Kumar, Sushil Modi Of Delaying Counting In 10 Seats బీహార్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న వేల ఆర్జేడీ సంచలన ఆరోపణలు చేసింది. 10 నియోజకవర్గాల్లో ఓట్ల కౌంటింగ్ ను నితీష్ ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోందని ఆర్జేడీ ఆరోపించింది. నితీష్ ప్రభుత్వం ఎన్నికల మోసానికి పాల్పడుతోందని ఆర్జేడీ ట్వీట్ చేసింది. 10స్థానాల్లో గెలిచిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలో ఎన్నికల అధికారులు ఆలస్యం చేస్తున్నారని పేర్కొంది.
హోరాహోరీగా పోటీ పడుతున్న స్థానాల్లో అధికార జేడీయూ-బీజేపీ కూటమికి తీర్పు అనుకూలంగా వచ్చేలా ప్రకటించడానికి జిల్లా మరియు ఎన్నికల అధికారులపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ ఒత్తిడి తెచ్చేందుకు కుట్ర పన్నారని ప్రతిపక్ష పార్టీ తెలిపింది.
కాగా,బీహార్ ఎన్నికల్లో 4.10కోట్ల ఓట్లు పోలవ్వగా..ఇవాళ సాయంత్రం 8గంటల సమయానికి 3.40కోట్ల ఓట్ల లెక్కింపు జరిగింది. ఇంకా 70లక్షల ఓట్లు లెక్కించాల్సి ఉందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
బీహార్ లోని మొత్తం 243స్థానాలకుగాను ఇప్పటివరకు 52స్థానాల ఫలితాలను ఈసీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు బీజేపీ16,ఆర్జేడీ16 స్థానాల్లో విజయం సాధించగా..కాంగ్రెస్3,వామపక్షాలు 4స్థానాల్లో విజయం సాధించాయి. ఓ ఇండిపెండెంట్ విజయం సాధించారు.విఐపీ2,ఏఐఎంఐఎం,హెచ్ఏఎమ్(ఎస్)ఒక్కో స్థానంలో విజయం సాధించాయి.
ఇప్పటివరకు చూస్తే..ఎన్డీయే 126స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా,మహాకూటమి 110స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.